TELANGANA

సౌదీ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, అక్కడే అంత్యక్రియలు: తెలంగాణ ప్రభుత్వం

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హైదరాబాద్ నగరానికి చెందిన 45 మంది యాత్రికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మృతుల ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా హైదరాబాద్ నగరానికి చెందినవారే కావడంతో, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించేందుకు మంత్రివర్గం ఈ చర్య తీసుకుంది.

అదే సమయంలో, మృతి చెందిన వారి భౌతిక కాయాలను హైదరాబాద్‌కు తీసుకు వచ్చేందుకు వీలు లేనందున, అక్కడే మత సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించాలని కూడా మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ అంత్యక్రియలను పర్యవేక్షించేందుకు మరియు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం ఒక బృందాన్ని సౌదీకి పంపనుంది.

ఈ బృందంలో బాధిత కుటుంబాలకు సంబంధించిన ఇద్దరు సభ్యులతో పాటు, మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్, ఒక ఎంఐఎం ఎమ్మెల్యే మరియు ఒక అధికారి ఉంటారు. మొత్తం 45 మంది మృతి చెందిన ఈ దుర్ఘటనపై ప్రభుత్వం అప్రమత్తమై, బాధితుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలబడేందుకు తగిన చర్యలు తీసుకుంది.