TELANGANA

‘ఐబొమ్మ’ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ

ఇటీవల సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దృష్టి సారించారు. ఈ కేసులో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగి ఉంటుందని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ కేసు వివరాలను తమకు అందించాలని కోరుతూ ఈడీ అధికారులు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు లేఖ రాశారు.

పోలీసులు ఇప్పటికే ఇమ్మడి రవి నుంచి మూడున్నర కోట్ల రూపాయలను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. రవికి దాదాపు నలభైకి పైగా బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు సమాచారం. విదేశీ బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో నగదుతో పాటు, క్రిప్టో వాలెట్ నుంచి నెలకు పదిహేను లక్షల రూపాయలు రవి ఎన్‌ఆర్‌ఈ (NRI) ఖాతాకు బదిలీ అయినట్లు ఈడీ అధికారులు సమాచారం అందుకున్నారు.

ఈ నగదును రవి ఇతర దేశాలకు ఏ రూపంలో తరలించారన్న దానిపై ఈడీ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. మనీలాండరింగ్ కోణంలో కేసు పూర్తి వివరాలను పరిశీలించి, రవి ఆర్థిక లావాదేవీల చిట్టాను పూర్తిగా బయట పెట్టాలని ఈడీ భావిస్తోంది.