ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా దరియాపూర్ గ్రామంలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పెళ్లై భార్య ఉన్నప్పటికీ, 35 ఏళ్ల చంపీ అనే వ్యక్తి తన మాజీ ప్రియురాలిపై మోజు పెంచుకున్నాడు. ఆ యువతికి మరొకరితో వివాహం జరగడంతో ఆమె చంపీకి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో, సోమవారం మధ్యాహ్నం ఆ యువతి కట్టెల పొయ్యి కోసం బంకమట్టిని సేకరించడానికి దగ్గర్లో ఉన్న చెరువు వద్దకు ఒంటరిగా వెళ్లగా, చంపీ ఆమెను వెంబడించాడు.
చెరువు వద్ద ఆ యువతిని బలవంతంగా పట్టుకుని వేధించడానికి ప్రయత్నించిన చంపీ, ఆమెను ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించాడు. చంపీ ప్రయత్నాలను ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించినా, అతడు బలవంతం చేయడంతో, ఆత్మరక్షణలో భాగంగా అతడి నాలుకను గట్టిగా కొరికింది. దీంతో చంపీ నాలుకలోని కొంత భాగం తెగిపడి, తీవ్ర రక్తస్రావం, నొప్పితో అతను గట్టిగా అరవడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు.
గ్రామస్తులు వెంటనే చంపీని దగ్గర్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని కాన్పూర్‌లోని హాలెట్ ఆస్పత్రికి పంపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దినేష్ త్రిపాఠి ఈ విషయాన్ని ధృవీకరించారు.

