తెలంగాణలో ఇప్పటికే గ్రూప్-1 వివాదం కొనసాగుతుండగా, మరో సంచలన నిర్ణయంతో గ్రూప్-2 అభ్యర్థులకు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. 2015–16 సంవత్సరాల్లో అప్పటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్ష నిర్వహణలో TGPSC హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించింది అని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది. దాదాపు పది సంవత్సరాల క్రితం ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఇది ఊహించని పరిణామంగా మారింది.
తమ ఓఎంఆర్ షీట్లలో ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి నగేష్ భీమపాక నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ పరీక్షలో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయని గుర్తించిన కోర్టు, TGPSC కోర్టు ఆదేశాలను పాటించలేదని, తమ పరిధిని దాటి వ్యవహరించిందని ఆక్షేపించింది. దీంతో 2015–16 గ్రూప్–2 పరీక్షను పూర్తిగా రద్దు చేస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.
రద్దుతో పాటు, హైకోర్టు TGPSC కి స్పష్టమైన ఆదేశాలు, గడువును కూడా నిర్ణయించింది. 8 వారాల లోపు పాత పరీక్ష పత్రాలకు పునర్మూల్యాంకనం (Re-evaluation) పూర్తి చేయాలని, ఆ తర్వాత కొత్త అర్హుల జాబితాను (New Merit List) ప్రకటించాలని ఆదేశించింది. పదేళ్ల క్రితమే సెలెక్ట్ అయి, ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ తీర్పు తీవ్ర ఆందోళన కలిగించింది. తమ భవిష్యత్ ఏమవుతుందోనని వారు టెన్షన్‌కు గురవుతున్నారు.

