AP

మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో టాప్ ఐఈడీ నిపుణుడు ‘టెక్ శంకర్’ మృతి

అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లి ఏజెన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఎదురుకాల్పుల్లో మృతి చెందిన వారిలో శ్రీకాకుళం జిల్లా, వజ్రపుకొత్తూరు మండలం, బాతుపురం గ్రామానికి చెందిన మెట్టూరి జోగారావు అలియాస్ “టెక్ శంకర్” ఉన్నారు. మూడున్నర దశాబ్దాలుగా సాయుధ పోరాటంలో అడవుల్లో తిరిగిన ఈ మావోయిస్టు నేత జీవితం తుపాకీ గుళ్లతో ముగిసింది. శంకర్ మృతితో అతని స్వగ్రామం బాతుపురం శోకసంద్రంలో మునిగిపోయింది.

శంకర్ జీవితం 1988లో జరిగిన ప్రజా ఉద్యమంతో మలుపు తిరిగింది. గ్రామీణ అన్యాయాలు, ఆర్థిక అసమానతల ప్రభావంతో అదే సంవత్సరంలో అతను మావోయిస్టు పార్టీ లోకల్ యూనిట్‌లో చేరారు. క్రమంగా అతను పార్టీకి నమ్మిన క్యాడర్‌గా ఎదిగారు. ముఖ్యంగా, 1995లో జరిగిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే/ఎంపీ సుబ్బరామిరెడ్డిపై కాల్పుల ఘటనలో అతని పాత్ర కీలకమని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించడంతో, పార్టీలో శంకర్‌కు ప్రాధాన్యం పెరిగింది. పేలుడు పదార్థాల తయారీ, ఐఈడీ (IED) ల్లో నిపుణుడిగా అతను రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇంటెలిజెన్స్ రికార్డుల్లో శంకర్‌ను పార్టీ వ్యూహకర్తగా, కీలక ఆపరేషన్ల మేధావిగా గుర్తించారు.

నిన్న మారేడుమిల్లి అడవుల్లో గ్రేహౌండ్స్‌తో జరిగిన ఎదురుకాల్పులు శంకర్ 35 ఏళ్ల సాయుధ ప్రయాణానికి ముగింపు పలికాయి. ఏపీ ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు అధికారికంగా ప్రకటించగా, ఆ మృతదేహాల్లో శంకర్ కూడా ఉన్నట్లు ధృవీకరించారు. శంకర్ కుటుంబ సభ్యులు ప్రస్తుతం రంపచోడవరంలో మృతదేహం కోసం ప్రయత్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్యమ చరిత్రలో కీలక పాత్ర పోషించిన శంకర్ మరణం, ఆ ప్రాంతంలో ఒక అధ్యాయాన్ని ముగించింది.