TELANGANA

కొడంగల్ ను అత్యున్నత విద్యా కేంద్రంగా మారుస్తాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని స్థానిక బహిరంగ సభలో ప్రకటించారు. కొడంగల్‌ను అత్యున్నత విద్యా కేంద్రంగా మార్చే లక్ష్యంతో, అన్ని రకాల సదుపాయాలు మరియు కార్పొరేట్ తరహా విద్యను అందించే ఒక సైనిక్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ విద్యాసంస్థ కోసం విద్యార్థులు ఇతర ప్రాంతాల నుంచి కూడా కొడంగల్‌కు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

సైనిక్ స్కూల్‌లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆహారాన్ని కూడా అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ నిర్మాణం పదహారు నెలల్లో పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యారంగంతో పాటు మౌలిక వసతుల కల్పనలో భాగంగా, కొడంగల్ నియోజకవర్గానికి త్వరలో కృష్ణా నీటిని తీసుకువస్తామని, అలాగే ఈ ప్రాంత ప్రజలు ఏడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రైలు మార్గాన్ని కూడా వచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.

కొడంగల్ అభివృద్ధికి అడ్డుపడే వారిని అడ్డుకోవాలని ప్రజలకు పిలుపు నిచ్చిన ముఖ్యమంత్రి, లగచర్ల ప్రాంత రైతులను ఒప్పించి అక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి నాయకులను ఎన్నుకోవాలని, ప్రభుత్వానికి సహకరిస్తూ కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.