AP

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు: ఉచిత లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజుల పాటు కల్పించనున్న వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో, తొలి మూడు రోజులకు (డిసెంబర్ 30, 31, జనవరి 1) సంబంధించిన ఉచిత వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను ఎలక్ట్రానిక్ డిప్ (లక్కీ డిప్) ద్వారా కేటాయించే ప్రక్రియను టీటీడీ ప్రారంభించింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 27 ఉదయం 10 గంటలకు ప్రారంభమై, డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.

ఈ ఉచిత టికెట్ల కోసం భక్తులు టీటీడీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. టెక్నాలజీని విస్తరిస్తూ, టీటీడీ ఈసారి వాట్సాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం భక్తులు ముందుగా ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్ నంబర్‌కు (9552300009) ‘గోవిందా’ లేదా ‘హాయ్’ అని మెసేజ్ చేసి, ఆ తర్వాత భాషను ఎంచుకుని, టీటీడీ టెంపుల్ సర్వీసెస్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం వైకుంఠ ద్వార దర్శనం రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను ఎంచుకుని, చిరునామా, ఆధార్ వివరాలు ఎంటర్ చేసి నమోదు చేసుకోవాలి.

నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు చేసుకున్న రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపికైన భక్తుల వివరాలు డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడి కానున్నాయి. ఎంపికైన భక్తులకు 1+3 విధానంలో కుటుంబ సభ్యులు అందరికీ లభించేలా టోకెన్లను జారీ చేస్తారు. లక్కీ డిప్‌లో ఎంపికైన భక్తుల ఫోన్ నంబర్లకు మెసేజ్ వస్తుందని టీటీడీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా, ఒక మొబైల్ నంబర్ మరియు ఒక ఆధార్ కార్డుకు ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది.