AP

కడప-రేణిగుంట గ్రీన్‌ ఫీల్డ్ హైవే పనులు షురూ: వన్యప్రాణుల కోసం 4 భారీ వంతెనలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా, మూడేళ్లుగా ముందుకు సాగని కడప – రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పనుల్లో కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్ట్ శేషాచలం అటవీ ప్రాంతం మీదుగా నిర్మించాల్సి ఉండటంతో పర్యావరణ అనుమతులలో జాప్యం జరిగింది. అయితే, కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో అనుమతులు మంజూరు చేయించుకోవడంతో, ప్రస్తుతం కడప-రాజంపేట రహదారి (మొదటి ప్యాకేజీ) పనులు ప్రారంభమయ్యాయి.

కడప – రేణిగుంట జాతీయ రహదారి పనులను ప్యాకేజీల వారీగా చేపడుతున్నారు. ఈ హైవే పనులను గ్రామాలు, పట్టణాలలో భవనాల తొలగింపు వంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో పూర్తిగా అటవీ భూములకు సమీపంగానే ఉండేలా అధికారులు ప్లాన్ చేశారు. మొదటి ప్యాకేజీ కింద రాజంపేట నుంచి కడప వరకు నిర్మిస్తున్న రహదారి కోసం సేకరించిన భూమిలో పెరిగిన పిచ్చిమొక్కలు, కంపచెట్లను తొలగించే పనులను ప్రస్తుతం వేగవంతం చేశారు.

అటవీ భూములు, వన్యప్రాణుల సంచారం ఉండే ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాజెక్టులో పర్యావరణ పరిరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వన్యప్రాణులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అవి హైవే మీదకు రాకుండా ఉండేందుకు నాలుగు ప్రదేశాల్లో భారీ వంతెనలు (ఎలివేటెడ్ కారిడార్లు) ఏర్పాటు చేయనున్నారు. ఈ వంతెనల ఏర్పాటు ద్వారా వన్యప్రాణుల సంచారానికి వీలు కల్పించాలని అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.