ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై సీఐడీ అధికారులు హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించారు. అలాగే, ఈ కేసులో నిందితుడుగా ఉన్న రవికుమార్ ఆస్తులకు సంబంధించిన నివేదికను కూడా ఏసీబీ అధికారులు హైకోర్టుకు అందజేశారు.
ఈ రెండు నివేదికలను తమ ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జ్యుడీషియల్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. నివేదికను అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని నిందితుడు రవికుమార్ తరఫు సీనియర్ న్యాయవాది కోరినప్పటికీ, హైకోర్టు న్యాయమూర్తి ఆ అభ్యర్థనను తోసిపుచ్చారు.
పరకామణి చోరీ కేసులో తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే కొందరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

