బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత కల్వకుంట్ల కవిత, పార్టీ నేతలు మరియు ఎమ్మెల్యేలపై చేస్తున్న విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో వేడిని పెంచుతున్నాయి. ‘తెలంగాణ జాగృతి’ పేరిట రాష్ట్రంలో పర్యటిస్తున్న కవిత, మాజీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలపై విరుచుకుపడుతున్నారు. అయితే, బీఆర్ఎస్ నేతలు మాత్రం కవిత విమర్శలకు దీటుగా, తీవ్ర పదజాలంతో వ్యక్తిగత ఎదురుదాడికి దిగుతున్నారు.
కవిత వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతోందని గులాబీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కవిత చేస్తున్న విమర్శలు కేసీఆర్ పాలనపైనే వేసినట్లు అవుతోందని ప్రశ్నిస్తున్నారు. గతంలో వంగి వంగి నమస్కారాలు చేసిన వారే ఇప్పుడు విమర్శలు చేస్తుండటం గమనార్హం. ఇటీవల మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై కవిత విమర్శలు చేయగా, ఆయన ఆమెను ‘లిక్కర్ రాణి’ అంటూ వ్యాఖ్యానించారు.
తాజాగా కూకట్పల్లిలో బీఆర్ఎస్ను ‘బీటీం, యూటీం’ అంటూ మల్లారెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేలపై కవిత విమర్శలు చేయగా, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రంగా స్పందించారు. కవిత చరిత్ర, ఆమె భర్త అక్రమాల చిట్టా తన వద్ద ఉందని, మంత్రి పదవులు ఎంతకు అమ్ముకున్నారో అందరికీ తెలుసునని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కవిత ‘రెండు విమర్శలు చేస్తే, బీఆర్ఎస్ నేతలు నాలుగు తగిలించుకుని తిరుగుతున్నారన్న’ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

