ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1870 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రికార్డు సృష్టించింది. ముఖ్యంగా హిందీలోనే ఈ చిత్రం రూ.800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ అద్భుత విజయం వెనుక నార్త్ ఇండియాలో నిర్వహించిన ఒక ప్రమోషనల్ ఈవెంట్ కీలక పాత్ర పోషించిందని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై. రవి శంకర్ వెల్లడించారు.
‘చాయ్ షాట్స్’ గ్రాండ్ లాంచ్ ఈవెంట్కు హాజరైన నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ.. తమ బ్యానర్ ఈ స్థాయిలో ఎదగడానికి ‘చాయ్ బిస్కెట్’ సంస్థకు చెందిన శరత్, అనురాగ్ కూడా కారణమని తెలిపారు. ‘పుష్ప 2’ మార్కెటింగ్ గురించి పెద్ద పెద్ద కంపెనీలతో చర్చించినప్పటికీ, చివరికి చాయ్ బిస్కెట్ ఇచ్చిన క్రియేటివ్ ఐడియాలే అమలు అయ్యాయని ఆయన చెప్పారు.
ముఖ్యంగా, బీహార్లో ఒక ప్రమోషనల్ ఈవెంట్ చేయాలనే కీలక ఆలోచన ‘చాయ్ బిస్కెట్’ నుంచే వచ్చిందని రవి శంకర్ తెలిపారు. ఆ ఒక్క ఈవెంట్ కారణంగానే ‘పుష్ప 2’ సినిమాకు హిందీలో అదనంగా రూ.300 నుంచి 400 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రవి శంకర్ ‘చాయ్ షాట్స్’ సంస్థకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

