TELANGANA

‘అట్టర్ ఫ్లాప్ షో’: గ్లోబల్ సమ్మిట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన **’తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’**ను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. ఈ సమ్మిట్ గ్లోబల్ సమ్మిట్‌లాగా కాకుండా, కేవలం భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో లాగా ఉందని ఆయన ఆరోపించారు. ఫ్యూచర్‌ సిటీ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమం అందాల పోటీల్లాగే, ఏఐ సమ్మిట్ లాగే.. అట్టర్ ఫ్లాప్ షో అయ్యిందని, అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ సమ్మిట్‌లో విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌పై కూడా హరీష్ రావు విమర్శలు గుప్పించారు. అందులో విజన్ లేదని, దాన్ని చేరుకునే మిషన్ లేదని పేర్కొంటూ, ఇది అక్షరాలు, అంకెలు, రంగురంగుల పేజీలతో అర్థం లేకుండా అల్లిన అబద్ధాలు, అర్థసత్యాల ‘విజన్ లెస్’ డాక్యుమెంట్ అని కొట్టిపారేశారు. గ్లోబల్ సమ్మిట్ అని మూడు నెలల నుంచి ఊదరగొట్టిన రేవంత్ ప్రభుత్వం, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 5 వేల మంది విదేశీ ప్రతినిధులు వస్తారని చెప్పినా కనీసం ఒక్క ముఖ్యమంత్రి కానీ, విదేశీ రిప్రెజెంటేటివ్స్ కానీ రాలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి భాగస్వామి డీకే శివకుమార్ తప్ప, చివరకు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని, ఇది లోకల్ సమ్మిట్, అట్టర్ ఫ్లాప్ పొలిటికల్ షో అని ఆయన తీవ్రంగా విమర్శించారు.

ఫార్మా సిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ అని, అందులో పెట్టుబడుల కోసం గ్లోబల్ సమ్మిట్ అని రేవంత్ రెడ్డి ఒక అందమైన కట్టుకథ అల్లారని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికే భూముల స్కాం, పవర్ స్కాం, లిక్కర్ స్కాం అయ్యిందని, ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్కాం మొదలుపెట్టారని అన్నారు. ఈ సమ్మిట్ పెట్టింది రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కోసమేనని అందరికీ అర్థమైందని పేర్కొన్నారు. రేవంతు ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా కోట్లు ఖర్చు చేసి తిరిగిన దేశాలు, నిర్వహించిన సమ్మిట్స్ ద్వారా వచ్చిన మొత్తం పెట్టుబడులు, గ్రౌండ్ అయిన కంపెనీలు, ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.