TELANGANA

GHMC డివిజన్ల పెంపుపై హైకోర్టులో పిటిషన్: ఏకపక్ష విభజన అంటూ అభ్యంతరాలు

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని వార్డుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 150 నుంచి ఏకంగా 300కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో జనాభా పెరుగుదల, పరిపాలన సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు డిసెంబర్ 8న గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. కొత్తగా నగర శివారులోని 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసి, డివిజన్ల సంఖ్యను పెంచడం జరిగింది.

అయితే, జీహెచ్‌ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపును సవాల్ చేస్తూ వినయ్‌కుమార్ అనే వ్యక్తి సోమవారం (డిసెంబర్ 15) తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. డివిజన్ల పునర్విభజన ఏకపక్షంగా, అసంబద్ధంగా జరిగిందని పిటిషనర్ ఆరోపించారు. వార్డుల పునర్విభజన సమయంలో ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని, భౌగోళిక సౌలభ్యం, జనాభా, పరిపాలనా సమతుల్యత వంటి అంశాలను పక్కన పెట్టారని ఆయన పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌లో రాంనగర్ డివిజన్‌పై తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. జస్టిస్‌ బి విజయ్‌సేన్‌ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, తదుపరి విచారణను డిసెంబర్ 16కు వాయిదా వేసింది. డివిజన్ల సంఖ్య పెంపు ద్వారా పాలన సులభతరం అవుతుందని, కార్పొరేటర్లు తమ వార్డు సమస్యలపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఇప్పుడు న్యాయపరమైన వివాదంలో పడింది.