TELANGANA

కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది: స్పీకర్ తీర్పుపై కేటీఆర్ నిప్పులు.. ఉప ఎన్నికల భయంతోనే ఇదంతా!

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగం మరియు అత్యున్నత న్యాయస్థానాల పట్ల గౌరవం లేదని ఈ తీర్పుతో మరోసారి స్పష్టమైందని, రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరిగితే సరిపోదని ఆయన ఎద్దేవా చేశారు.

తన తండ్రి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని గౌరవించడంలో విఫలమైన అసమర్థ నేతగా రాహుల్ గాంధీ చరిత్రలో నిలిచిపోతారని కేటీఆర్ విమర్శించారు. కేవలం ఉప ఎన్నికలకు భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధమైన అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆ భయంతోనే ఫిరాయింపుదారులను కాపాడేందుకు రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ నాయకత్వం ఒత్తిడికి తలొగ్గే స్పీకర్ ఇటువంటి అప్రజాస్వామిక నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పుల స్ఫూర్తిని విస్మరించడం ఆశ్చర్యకరమని, ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. సాంకేతిక కారణాలతో ఎమ్మెల్యేలను ఇప్పుడు కాపాడుకోవచ్చు కానీ, ప్రజలు ఇప్పటికే వారిపై ప్రజాక్షేత్రంలో అనర్హత వేటు వేశారని ఆయన పేర్కొన్నారు. ఈ అన్యాయంపై న్యాయపోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.