TELANGANA

గుర్తు లేని ఎన్నికల్లోనే 4 వేల స్థానాలు గెలిచాం: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రేవంత్ సిద్ధమా? – హరీశ్ రావు

తెలంగాణలో పార్టీ గుర్తు లేకుండా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అంచనాలకు మించి రాణించిందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ విజేతల సన్మాన సభలో పాల్గొన్న ఆయన, కారు గుర్తు లేకపోయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 4,000 పైగా సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారని వెల్లడించారు. సాధారణంగా అధికార పార్టీ 90 శాతం స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుందని, కానీ కాంగ్రెస్ కేవలం 64 శాతానికే పరిమితమైందని ఆయన ఎద్దేవా చేశారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికలంటేనే వణుకు పుడుతోందని హరీశ్ రావు విమర్శించారు. అందుకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించారు. సాధారణంగా ఏ ముఖ్యమంత్రి కూడా పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేయరని, కానీ ఓడిపోతామనే భయంతో రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకుని ఊరూరా తిరిగారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ముంటే, పార్టీ గుర్తులతో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని ఆయన సవాల్ విసిరారు.

బీఆర్ఎస్ పార్టీ అంతమైందని రేవంత్ రెడ్డి పదే పదే కలవరిస్తున్నారని, కానీ నిద్రలో కూడా ఆయనకు కేసీఆర్ పేరే గుర్తొస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. కేసీఆర్ పేరు లేకుండా రేవంత్ రెడ్డి ఒక్క ప్రసంగం కూడా చేయలేకపోతున్నారని విమర్శించారు. ప్రజలు కారు గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని, అందుకే ప్రత్యక్ష ఎన్నికలంటే కాంగ్రెస్ వెనకడుగు వేస్తోందని దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటుతుందని, కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు.