పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మరణించిన కె. రాధమ్మ (65) అనే వృద్ధురాలి మృతదేహాన్ని చెత్త తరలించే వాహనంలో తీసుకెళ్లారంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనను కొన్ని మాధ్యమాలు కావాలనే వక్రీకరించాయని, వాస్తవానికి అక్కడ ఎటువంటి నిర్లక్ష్యం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఫ్యాక్ట్ చెక్ నివేదికను విడుదల చేసింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాధమ్మ మరణించిన తర్వాత, మృతదేహాన్ని వారి ఇంటికి చేర్చడానికి ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తామని కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే, ఆసుపత్రి నుంచి వారి ఇల్లు కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉండటంతో, మృతురాలి సోదరుడు అంబులెన్స్ కోసం వేచి ఉండటానికి ఇష్టపడలేదు. తన వద్ద ఉన్న సొంత మూడు చక్రాల సరుకు రవాణా వాహనంలోనే మృతదేహాన్ని తీసుకువెళ్లాలని ఆయన స్వయంగా నిర్ణయించుకున్నారని అధికారులు వివరించారు.
ప్రచారంలో ఉన్నట్లుగా అది చెత్తను తరలించే మున్సిపల్ వాహనం కాదని, అది పూర్తిగా ఒక ప్రైవేట్ సరుకు రవాణా వాహనమని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైద్య సేవల అందించడంలో కానీ, మృతదేహ తరలింపునకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో కానీ ఆసుపత్రి యంత్రాంగం వైఫల్యం చెందలేదని అధికారులు ధృవీకరించారు. దురదృష్టకరమైన మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ప్రభుత్వం కోరింది.

