గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు మరియు కృష్ణా జలాల పంపకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ఘాటుగా సమాధానమిచ్చారు. తెలంగాణ ప్రయోజనాలే తనకు అత్యంత ప్రాధాన్యత అని, తన ప్రాంత హితం కోసమే గతంలో పార్టీని వీడానని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా తాను ఎన్నడూ వ్యవహరించబోనని, ఒకవేళ అన్యాయం జరిగే పరిస్థితి వస్తే పదవి కంటే తెలంగాణే ముఖ్యమని స్పష్టం చేస్తూ “దేవుడి మీద ఒట్టు” వేసి తన కమిట్‌మెంట్‌ను చాటుకున్నారు.
గత పాలకుల నిర్ణయాల వల్లే ప్రస్తుత వివాదాలు తలెత్తాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 2016లో అప్పటి సీఎం కేసీఆర్ గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని జల్‌శక్తి శాఖ సమావేశంలో చేసిన వ్యాఖ్యలే చంద్రబాబు బనకచర్ల ప్రతిపాదనకు పునాది అని ఆయన పేర్కొన్నారు. అలాగే కృష్ణా జలాల విషయంలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు ఉండేలా గత ప్రభుత్వం సంతకాలు చేసిందని, 2020లో వాటా పెంచుకునే అవకాశం వచ్చినా కేసీఆర్ ప్రభుత్వం దానిని వినియోగించుకోలేదని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిలిపివేయించామని, ఆ పనులు ఆపితేనే చర్చలకు వస్తామనే కఠిన షరతు పెట్టామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయంలో నిజనిర్ధారణ కమిటీ ద్వారా విచారణకు కూడా తాము సిద్ధమని సవాల్ విసిరారు. “చచ్చినా.. బతికినా తెలంగాణ కోసమే” అని భావోద్వేగంగా మాట్లాడుతూ, ఏ పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి నీటి వాటాలో అన్యాయం జరగనివ్వనని సభ సాక్షిగా ప్రకటించారు.

