కరీంనగర్ జిల్లాకు కేంద్రమంత్రి బండి సంజయ్ తీపికబురు చెప్పారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం, కరీంనగర్ జిల్లాలో ‘ఆయుష్’ ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 50 పడకల సామర్థ్యంతో కరీంనగర్ జిల్లాలో ఆయుష్ ఆసుపత్రిని మంజూరు చేస్తూ కేంద్రం పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది.
ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఈ ఆసుపత్రి ఏర్పాటుకు మొత్తం రూ.15 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. అందులో తొలి విడతగా రూ.7.5 కోట్ల నిధులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.అంతేకాదు ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటు అనువైన, అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసి తమకు పంపాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది.స్థల ఎంపికతో పాటు ఆసుపత్రి నిర్వహణ, డాక్టర్లు మరియు ఇతర సిబ్బంది నియామక బాధ్యతలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించింది.
కేంద్రం నుండి అనుమతులు, ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటుపై చర్చలు
కరీంనగర్ ప్రజలకు ఆయుర్వేదం, యోగ, యునానీ, సిద్ధ, హోమియోపతి వంటి సంప్రదాయ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రం నుంచి అనుమతి రావడంతో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆయుష్ శాఖ అధికారులతో సమావేశమై ప్రాథమిక చర్చలు నిర్వహించారు.
ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆస్పత్రి ఏర్పాటు.. స్థలం ఎంపిక
ఆసుపత్రి ఏర్పాటుకు అవసరమైన భూమి లభ్యత, మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు సులభంగా చేరుకునే ప్రాంతంలోనే, ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆయుష్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించినట్లు సమాచారం.ఈ ఆసుపత్రి ఏర్పాటు వల్ల కరీంనగర్ జిల్లా ప్రజలకే కాకుండా పరిసర జిల్లాల ప్రజలకు కూడా చాలా ప్రయోజనం చేకూరనుంది.

