తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతికి ముందు రైతులకు మరోమారు శుభవార్త చెప్పింది. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అఫిడవిట్ దాఖలు చేసే నిబంధనను తొలగించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే భూ సమస్యల పరిష్కారం మరింత త్వరితగతిన జరుగుతుందని దీని కారణంగా వేలాది మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.
సాదా బైనామా సమస్యల పరిష్కారానికి జీవో
మరో రెండు మూడు రోజులలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. గత సంవత్సరం రెవిన్యూ శాఖ భూభారతి చట్టంలోని సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 ప్రకారం సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించడానికి జీవో నెంబర్ 106ను జారీ చేసింది. అయితే 2025 సెప్టెంబర్ 10న విడుదలైన ఈ జీవోలో భూభారతి చట్టంలో లేని మూడు అంశాలను చేర్చడం వల్ల అది వివాదానికి దారి తీసింది.
అఫిడవిట్ నిబంధనతో పెద్ద ఆందోళన
ఇందులో భూమి అమ్మిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధన ప్రధానంగా ఉంది. జీవోలో జారీ చేసిన ఈ అఫిడవిట్ నిబంధన పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది కొనుగోలు హక్కులకు భంగం కలిగిస్తుందని, నకిలీ అఫిడవిట్లు సృష్టించే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ నిబంధన భూ వివాదాలను మరింత పెంచుతుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎప్పుడో కొన్న భూములకు ఇప్పుడు అఫిడవిట్.. రైతుల అసహనం
అయితే భూమి అమ్మిన వ్యక్తి మరణించినప్పుడు, వారసులతో వివాదాలు ఉన్నప్పుడు ఈ అఫిడవిట్ను తీసుకోవడం మరింత కష్టమని చాలామంది వాదించారు. ఎప్పుడో ఏళ్ళ క్రితం కొనుగోలు చేసిన భూములకు ఇప్పుడు అఫిడవిట్ అడగడం ఆచరణ సాధ్యం కాదని పలువురు అభిప్రాయపడ్డారు. ఇక దీనికోసం మధ్యవర్తులు దిగుతారని అదనపు డబ్బులు వసూలు చేసి, రకరకాల భూ వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందనే చర్చ కూడా తెరపైకి వచ్చింది.
అఫిడవిట్ నిబంధన మినహాయించాలని నిర్ణయం
అఫిడవిట్ ఇవ్వనని భూమి అమ్మిన వ్యక్తి అడ్డం తిరిగితే న్యాయపరమైన చిక్కులు కూడా తలెత్తే అవకాశం ఉందని పలువురు చెప్పడంతో మార్గదర్శకాల నుంచి అఫిడవిట్ నిబంధనను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవిన్యూ శాఖ అడ్వకేట్ జనరల్ నుంచి ప్రభుత్వం న్యాయ సలహా కోరగా అఫిడవిట్ ను మినహాయించవచ్చు అని, అది తప్పనిసరి కాదని నిబంధనలను సవరిస్తూ మార్గదర్శకాలను సిద్ధం చేయడానికి సీసీఎల్ఏ చర్యలు చేపట్టింది.

