మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం సమీపంలో 44వ జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ భారీ ప్రమాదం జరిగింది. కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక నుంచి వస్తున్న బస్సు అదుపు తప్పి డీసీఎంను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ఘటన సమయంలో బస్సులో మొత్తం 53 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 27 మందికి పైగా గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ స్టీరింగ్‌లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు. పండుగ వేళ కావడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడం తీవ్ర కలకలం రేపింది.
అడిషనల్ ఎస్పీ ఎన్.బి. రత్నం ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బస్సు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం గాయపడిన వారందరికీ ఆసుపత్రిలో చికిత్స అందుతోందని, ఎవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

