హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన మాదాపూర్‌లో రోడ్డు కుంగిపోవడంతో సైబరాబాద్ పోలీసులు కీలక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శిల్పారామం సమీపంలోని సైబర్ గేట్ వద్ద భూగర్భ మంజీరా నీటి పైప్‌లైన్ లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. నిరంతరం నీరు లీక్ అవ్వడం వల్ల భూమి లోపల మట్టి పట్టు కోల్పోయి ఉపరితలం ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో ఐకియా (IKEA) నుంచి సైబర్ టవర్స్ మీదుగా జేఎన్టీయూ (JNTU) వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
ప్రస్తుతం మరమ్మతుల దృష్ట్యా పోలీసులు వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ఐకియా వైపు నుంచి వచ్చే వాహనాలను లెమన్ ట్రీ హోటల్ మరియు రైదుర్గం మెట్రో స్టేషన్ వద్ద మళ్లించారు. అక్కడి నుంచి వాహనదారులు టెక్ మహీంద్రా మరియు సీఐఐ (CII) జంక్షన్ మీదుగా సైబర్ టవర్స్ చేరుకోవచ్చు. సైబర్ టవర్స్ దాటిన తర్వాత జేఎన్టీయూ వైపు వెళ్లే వారు యథావిధిగా పాత మార్గంలోనే ప్రయాణించవచ్చని మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
దెబ్బతిన్న పైప్‌లైన్‌కు ఇప్పటికే మరమ్మతులు పూర్తి చేసి, కుంగిపోయిన ప్రాంతాన్ని మట్టితో నింపి రీ-సర్ఫేసింగ్ పనులు చేపట్టారు. ప్రస్తుతం రహదారి పటిష్టత కోసం ‘క్యూరింగ్’ ప్రక్రియ జరుగుతోంది. సంక్రాంతి సెలవుల కారణంగా ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండటంతో మరమ్మతు పనులు వేగంగా సాగాయి. సెలవులు ముగిసి ఐటీ ఉద్యోగులు తిరిగి వచ్చే సమయానికి ఈ రహదారిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు. అప్పటి వరకు వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.

