TELANGANA

హరీశ్ రావు సిట్ విచారణ పూర్తి: 7 గంటల పాటు కొనసాగిన ప్రశ్నల వర్షం

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విచారణ మంగళవారం ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ (SIT) అధికారులు ఆయనను సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. సోమవారం రాత్రే నోటీసులు అందుకున్న హరీశ్ రావు, మంగళవారం ఉదయం 11 గంటలకు అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం ఈ విచారణలో పాల్గొని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయనకు ఉన్న సంబంధాలపై ఆరా తీసింది.

విచారణ సమయంలో మధ్యాహ్నం 3 గంటలకు కేవలం అరగంట పాటు లంచ్ బ్రేక్ మినహా, మిగిలిన సమయమంతా అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ ముగిసిన అనంతరం హరీశ్ రావు నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు ఇతర ముఖ్య నేతలతో భేటీ అయ్యి, విచారణలో ఎదురైన ప్రశ్నలు మరియు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ విచారణ జరుగుతోందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరోవైపు, విచారణ ముగిసిన తర్వాత హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ ఘాటుగా స్పందించారు. లోపల జరిగిన విచారణలో పస లేదని, అడిగిందే అడుగుతూ కాలయాపన చేశారని విమర్శించారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వం వద్ద నిజంగా సాక్ష్యాలు ఉంటే విచారణకు సంబంధించిన వీడియోను బహిరంగంగా విడుదల చేయాలని ఆయన సవాల్ విసిరారు. ఈ కేసు కేవలం ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకేనని ఆయన ఆరోపించారు.