తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యి కల్తీ ఆరోపణలకు సంబంధించి సిట్ (SIT) దాఖలు చేసిన చార్జిషీట్‌లోని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి
భారీ కుట్ర
తిరుమల లడ్డూ నెయ్యి సరఫరాలో జరిగిన అక్రమాలపై సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ సంచలన విషయాలను బయటపెట్టింది. దాదాపు 10కి పైగా రాష్ట్రాల్లో విస్తరించిన ఈ భారీ నెట్‌వర్క్‌లో 36 మంది నిందితులు, డజన్ల కొద్దీ డెయిరీ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, హవాలా మధ్యవర్తులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. నిబంధనల మార్పు నుండి నకిలీ రికార్డుల సృష్టి వరకు ప్రతి దశలోనూ వ్యవస్థీకృత కుట్ర జరిగినట్లు సిట్ నిర్ధారించింది.
టెండర్ నిబంధనల ఉద్దేశపూర్వక మార్పు
విశ్వసనీయమైన సహకార డెయిరీలను టెండర్ల నుండి తప్పించి, ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా 2020లో నిబంధనలను భారీగా సడలించారు. వార్షిక టర్నోవర్ పరిమితిని రూ. 250 కోట్ల నుండి రూ. 150 కోట్లకు తగ్గించడం, పాల సేకరణ సామర్థ్యం, అనుభవ కాలం వంటి కీలక అంశాల్లో రాజీ పడటం వల్ల నాణ్యత లేని చిన్న డెయిరీలకు మార్గం సుగమమైంది. దీనివల్ల శ్రీవారి లడ్డూ నాణ్యతపై తీవ్ర ప్రభావం పడింది.
చుక్క పాలు లేకుండా ‘కెమికల్ నెయ్యి’ తయారీ
యూపీకి చెందిన ‘భోలే బాబా’ డెయిరీ కేంద్రంగా ఈ దందా సాగినట్లు ఆధారాలు లభించాయి. అసలు పాలు లేదా వెన్నను వాడకుండానే పామాయిల్, కర్నెల్ ఆయిల్ వంటి నూనెలను కలిపి కృత్రిమ నెయ్యిని తయారు చేశారు. ల్యాబ్ పరీక్షల్లో దొరక్కుండా ఉండేందుకు బీటా క్యారోటిన్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాలను, కృత్రిమ సువాసనలను జోడించారు. సుమారు 68 లక్షల కిలోల ఇటువంటి ‘కెమికల్ నెయ్యి’ని వీరు ఉత్పత్తి చేసినట్లు దర్యాప్తులో తేలింది.
అధికారుల ప్రమేయం, నకిలీ పత్రాలు
టీటీడీలోని ప్రొక్యూర్మెంట్ మరియు టెక్నికల్ విభాగాలకు చెందిన కొందరు సిబ్బంది తమ అధికారాలను దుర్వినియోగం చేశారు. సరైన తనిఖీలు చేయకుండానే కల్తీ నెయ్యి ట్యాంకర్లకు అనుమతులు ఇవ్వడం, తప్పుడు ల్యాబ్ రిపోర్టులను సృష్టించడం వంటి నేరాలకు పాల్పడ్డారు. తక్కువ ధరకు నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేయడం వల్ల టీటీడీకి సుమారు రూ. 235 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లడమే కాకుండా, కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.
లంచాలు, హవాలా చెల్లింపులు
ఈ కుంభకోణంలో భారీగా ముడుపులు చేతులు మారాయి. టెండర్లు ఇప్పించినందుకు, నాణ్యత తనిఖీల్లో వెసులుబాటు కల్పించినందుకు నిందితులు భారీగా లంచాలు డిమాండ్ చేశారు. ఈ లావాదేవీలన్నీ బ్యాంకింగ్ వ్యవస్థకు వెలుపల హవాలా మార్గంలో ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో మధ్యవర్తుల ద్వారా జరిగినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. వాట్సాప్ చాటింగ్‌ల ద్వారా ఈ నెట్‌వర్క్ నడిచినట్లు గుర్తించారు.
శాస్త్రీయ ఆధారాలు – నిర్ధారణ
గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ (NDDB) ప్రయోగశాల పరీక్షల్లో ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు కలవలేదని నిర్ధారణ అయింది. కానీ, కెమికల్ నెయ్యి తయారు చేసినట్టు తెలిపారు. నిందితులు డిలీట్ చేసిన డిజిటల్ డేటాను ఫోరెన్సిక్ ద్వారా వెలికి తీసిన సిట్, మొత్తం 500 రకాల బలమైన ఆధారాలను కోర్టుకు సమర్పించింది. తప్పుడు ఇన్వాయిస్‌లు, ఒకే వాహన నంబర్లను పదేపదే వాడటం వంటి మోసాలను శాస్త్రీయంగా నిరూపించారు.

