AP

అరవ శ్రీధర్ మరొక కొత్త వీడియో..!

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ఏం జరుగుతోంది? ఆయనకు సంబంధించి రోజుకో కొత్త వీడియో వెలుగులోకి వస్తోందా? ఈ యవ్వారం వెనుక పెద్ద వ్యక్తులు ఉన్నారా? జరుగుతున్న పరిణామాలపై జనసేన పార్టీ ఏమంటోంది? ఇంతకీ కొత్త వీడియోలో వచ్చిన అసలు మేటరేంటి?

 

అరవ శ్రీధర్ మరొక కొత్త వీడియో

 

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆయన్ని ఎవరో టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. అంతేకాదు మహిళా ఉద్యోగి, ఆయన ఫోన్‌ డేటాను సొంతం చేసుకున్నట్లు కనిపిస్తోంది. అరవ శ్రీధర్‌కి సంబంధించి మరో సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది.

 

తన ప్రేమని గుర్తించాలంటూ ఓ మహిళా ఉద్యోగినికి ఆయన వీడియో కాల్ వ్యవహారం బయటకు వచ్చింది. అందులో శ్రీధర్.. కారులో బ్లేడుతో చేయి కోసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉన్నట్లుండి ఆయన వైపు వీడియో వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఆయన మద్దతుదారులు షాకయ్యారు. ఈ వ్యవహారాన్ని వెనుక నుంచి ఎవరో నడిపిస్తున్నారని అంటున్నారు. ఈ వీడియో బ్యాక్ డ్రాప్‌లో ‘మజ్ను’ సినిమాలోని ఫేమస్ పాట యాడ్ చేశారు.

 

ఆ వీడియోలో కీలక అంశాలు.. ఈసారి ఏకంగా

 

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో జరుగుతున్న పరిణామాలను ఆ పార్టీ ఎప్పటికప్పుడు గమనిస్తోంది. బాధిత మహిళ వీడియోలను త్రిసభ్య కమిటీ సేకరించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవ శ్రీధర్ వెంటనే కమిటీ ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలని పార్టీ శాసనసభా పక్షం తేల్చి చెప్పింది. ఈ వ్యవహారానికి సంబంధించి సాక్ష్యాధారాలు, సంబంధిత అధికారులను సైతం కోరినట్టు తెలుస్తోంది.

 

కేవలం శ్రీధర్ వ్యవహారం మాత్రమే కాకుండా అటు బాధిత మహిళ గురించి కూడా కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాల ద్వారా జనసేన పార్టీకి చెడ్డ పేరు తేవాలని ప్రత్యర్థులతో బాధిత మహిళ కుట్ర పన్నినట్టు శ్రీధర్ వర్గీయులు చెబుతున్నారు. ఈ విషయం సద్దుమణగకుండా చేసేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు.

 

లైంగిక వేధింపులు, అబార్షన్ల ఆరోపణలతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే సదరు ఎమ్మెల్యే మాత్రం వీటిని డీప్ ఫేక్ వీడియోలుగా వర్ణిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఈ వ్యవహారంపై ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.