AP

అంబటి అరెస్టుపై జగన్ ఆగ్రహం: ‘తప్పు తెలుసుకున్న వ్యక్తిని పొగడాల్సింది పోయి జైల్లో పెడతారా?’

వైఎస్‌ఆర్‌సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటించారు. అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్, అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంబటి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారని, తప్పు తెలుసుకున్న వ్యక్తిని అభినందించాల్సింది పోయి, కక్షపూరితంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం దుర్మార్గమని జగన్ మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ‘జంగిల్ రాజ్’ (అరాచక పాలన) నడుస్తోందని జగన్ ఆరోపించారు. తిరుపతి లడ్డూ విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రశ్నించినందుకే తమ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేసి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాధవి, ఆమె అనుచరులపై కేవలం బెయిలబుల్ కేసులు పెట్టి, బాధితుడైన అంబటిపై మాత్రం కఠినమైన కేసులు నమోదు చేయడం ఏ రకమైన న్యాయమని జగన్ నిలదీశారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారులకు, అధికార పార్టీ నేతలకు జగన్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. అధికారం ఎప్పుడూ ఒకేలా ఉండదని, మూడేళ్ల తర్వాత మళ్లీ వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించి తమ నేతలను వేధిస్తున్న పోలీసు అధికారులను, కుట్రలు చేస్తున్న రాజకీయ నాయకులను వదిలిపెట్టబోమని, అందరికీ వడ్డీతో సహా బదులు తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అన్యాయంగా జైలుకు వెళ్లిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి పార్టీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు.