తెలుగు వెండితెరపై తనదైన హాస్యంతో కోట్లాది మందిని నవ్వించిన ఎమ్మెస్ నారాయణ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన జ్ఞాపకాలు అభిమానుల గుండెల్లో పదిలంగానే ఉన్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కుమార్తె శశికిరణ్ నారాయణ, తన తండ్రి మరణం తర్వాత తమ కుటుంబం ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి ఎమోషనల్ అయ్యారు. సంక్రాంతి పండుగ అంటే ఎంతో ఇష్టపడే నాన్న, సరిగ్గా అదే పండుగ సమయంలో భీమవరంలో అనారోగ్యానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లడం తమను తీరని వేదనకు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు.
నాన్న చనిపోయినప్పటి నుంచి గడిచిన పదేళ్లుగా తాము సంక్రాంతి పండుగను జరుపుకోలేదని శశి వెల్లడించారు. పండుగ వస్తే నాన్న లేరనే బాధే తప్ప, సంతోషం కలగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, నాన్నకు ఎంతో ఇష్టమైన ఆ పండుగను ఆయన కోసమైనా ఇకపై ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి సంక్రాంతి వేడుకలను తిరిగి ప్రారంభించి, ఆ సంతోషంలో నాన్నను చూసుకోవాలని తమ కుటుంబం భావిస్తున్నట్లు శశి వివరించారు.
ఎమ్మెస్ నారాయణ సినీ ప్రయాణం గురించి చెబుతూ.. ఆయన నిజానికి మంచి రచయిత మరియు లెక్చరర్ అని, సినిమాల్లో కూడా రైటర్ కావాలనే అనుకున్నారని ఆమె గుర్తుచేసుకున్నారు. కానీ నటుడిగా ఆయనకు వచ్చిన గుర్తింపు సామాన్యమైంది కాదని, నిరంతరం షూటింగ్లతో బిజీగా ఉంటూ కష్టపడేవారని శశి చెప్పారు. “నాన్న కాస్త విశ్రాంతి తీసుకుని మా ఎదుగుదలను చూసి ఉంటే బాగుండేది” అని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను కలిచివేస్తున్నాయి.

