పసి వయసులో వేసే పసుపు తాడు వారికి అవుతుంది ఏదో ఒకనాడు ఉరితాడు అని కదిరి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వీవీఎస్ శర్మ అన్నారు
ఈరోజు సమత స్వచ్ఛంద సంస్థ బాల్య వివాహాలపై విస్తృతంగా అవగాహన కల్పించడానికి రూపొందించిన బాల్య వివాహ విముక్తి ప్రచార రథం ను కదిరి రెవెన్యూ డివిజనల్ అధికారి వివిఎస్ శర్మ మరియు కదిరి డిఎస్పి శివ నారాయణ గారు మరియు కదిరి సిడిపిఓ రాధిక గారు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు మాట్లాడుతూ బాలికలు అభివృద్ధి చెందడానికి విద్య, వైద్యం, వసతులు అన్ని కల్పిస్తూ ప్రభుత్వం ఎన్ని పథకాలు తీసుకొస్తున్న బాల్యవివాహాలు ఇంకా జరగడం బాధాకరమైన విషయం అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2030 సంవత్సరము నాటికి బాల్యవివాహాలు లేని భారతదేశాన్ని చేయాలని ఒక ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతి బాల్యవివాహాన్ని మనం అడ్డుకోవలసి ఉంది. అంతేకాకుండా తల్లిదండ్రులలో, ప్రజలలో, విద్యావేత్తలలో స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా అవగాహన కల్పించడమే కాకుండా ప్రతి వర్గం వారిని ఇందులో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బాల్య వివాహం ఒక సామాజిక దురాచారంగా భావించి ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి ఉద్యమించాల్సిన అవసరం ఉంది అన్నారు. అందులో భాగంగా సమత స్వచ్ఛంద సంస్థ వారు బాల్య వివాహాల నివారణ కోసం గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహించడానికి ప్రచార రథాన్ని రూపొందించడం సంతోషదాయకమన్నారు. ఈ ప్రచార రథానికి అందరూ మద్దతు ఇవ్వాలని తెలిపారు. డీఎస్పీ శివ నారాయణ గారు మాట్లాడుతూ బాల్య వివాహాలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి మరియు తరతరాల పేదరికానికి దారితీయవచ్చు. బాల్య వివాహం పిల్లల హక్కులను దెబ్బతీస్తుంది మరియు వారిని హింస దోపిడీ మరియు దుర్వినియోగానికి గురిచేస్తుంది. బాల్య వివాహం చేసుకొని బాలికతో సంసారం చేస్తే బాలికపై అత్యాచారం జరిగినందుకు బాల్య వివాహ నిషేధ చట్టం 2006 ప్రకారం మరియు పాక్సో చట్టం ప్రకారం కూడా వారిని శిక్షించే అవకాశం ఉంది అని తెలిపారు. కదిరి సిడిపిఓ రాధిక గారు మాట్లాడుతూ బాల్య వివాహం చేస్తే గర్భధారణ మరియు ప్రసవ సమయంలో వచ్చే సమస్యల వల్ల ఆమె మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాల్య వివాహాలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కిషోరీ వికాసం పథకం ద్వారా వారికి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కిషోరీ బాలిక గ్రూపులను కూడా ఏర్పాటు చేసి వారికి నైపుణ్యాలను అందించి, వారి ద్వారా బాల్యవివాహాలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అయినా ఇంకా అక్కడక్కడ బాల్య వివాహాలు జరుగుతుండడం శోచ నీయమని తెలిపారు. సమత స్వచ్ఛంద సంస్థ జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ఈ ప్రచార రథము ద్వారా పురోహితులకు, మౌలానాలు, ఖాజీలు, చర్చి పాస్టర్లకు, పెళ్లికి క్యాటరింగ్ చేసే వారికి, టైలర్లకు, తల్లిదండ్రులకు, ప్రజలకు, డ్వాక్రా సంఘాల సభ్యులకు, గ్రామస్థాయిలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులకు, యువతి యువకులకు, పట్టణాలలోని ప్రధాన కూడళ్లలో, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, సినిమా థియేటర్ల దగ్గర బాల్య వివాహాల వలన జరిగే అనర్ధాలు మరియు బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం విధించే శిక్షల గురించి విస్తృతమైన అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సమత సంస్థ కమ్యూనిటీ సోషల్ వర్కర్ కళావతి పాల్గొన్నారు.

