AP

ఏపీలో 15 ఏళ్ల సుస్థిర పాలన: గుజరాత్ తరహా అభివృద్ధి కోసం కూటమి ఐక్యత అవసరం – సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు బలంగా కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఎన్నికల సమయంలో ప్రజల ముందు ప్రదర్శించిన ఐక్యతనే భవిష్యత్తులోనూ కొనసాగించాలని, అప్పుడే గుజరాత్ తరహాలో సుస్థిరమైన అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. గత 20 నెలల పాలనలో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఎలాంటి విభేదాలు రాకపోవడం శుభపరిణామమని, ఇదే స్ఫూర్తితో ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.

సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రతి సభ్యుడు తప్పనిసరిగా హాజరై, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సభలోనే ఉండాలని ఆదేశించారు. సభలో అర్థవంతమైన చర్చలు జరగాలని, ప్రతిపక్షాల విమర్శలకు ప్రతిగా అసభ్య పదజాలం వాడకుండా ప్రజామోదయోగ్యంగా వ్యవహరించాలని కోరారు. త్వరలోనే నియోజకవర్గాల వారీగా పెండింగ్ పనులను సమీక్షించి, ప్రాధాన్యతా క్రమంలో వాటిని పూర్తి చేస్తామని సభ్యులకు హామీ ఇచ్చారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంసాన్ని అధిగమించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తెచ్చేందుకు ఐక్యంగా పని చేస్తున్నామని చెప్పారు. పార్టీల మధ్య ఏవైనా భిన్నాభిప్రాయాలు ఉంటే వాటిని అంతర్గతంగా పరిష్కరించుకోవాలని, బహిరంగంగా విమర్శలు చేసుకోకూడదని సూచించారు. కూటమి ధర్మానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం 15 ఏళ్ల పాటు ఈ బంధం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.