CINEMA

దృశ్యం 3: రంగంలోకి ప్రకాశ్ రాజ్ – అక్షయ్ ఖన్నా స్థానంలో జైదీప్ అహ్లావత్!

అజయ్ దేవగణ్, అభిషేక్ పాఠక్ కాంబినేషన్‌లో వస్తున్న ‘దృశ్యం 3’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ ప్రాజెక్టులో చేరడం ఆసక్తికరంగా మారింది. గతంలో ‘సింగం’ చిత్రంలో అజయ్ దేవగణ్, ప్రకాశ్ రాజ్ మధ్య జరిగిన పోరాటం ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. మళ్ళీ చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ప్రకాశ్ రాజ్ తన పాత్ర గురించి స్పందిస్తూ.. ఇది ఒక ‘సెన్సేషనల్ రోల్’ అని, ఈ చిత్రంలో భాగమవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

మరోవైపు, గత పార్ట్ (‘దృశ్యం 2’)లో కీలకమైన పోలీస్ అధికారి పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీని వెనుక పెద్ద వివాదమే నెలకొంది. పారితోషికం విషయంలో బేధాభిప్రాయాలు మరియు షూటింగ్‌లో విగ్గు ధరించాలనే అక్షయ్ ఖన్నా మొండిపట్టు వల్ల ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం. అక్షయ్ ఖన్నాను ఒప్పించేందుకు నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ, ఆయన స్పందించకపోవడంతో మేకర్స్ ఆయనకు కోర్టు నోటీసులు పంపారు. అక్షయ్ ఖన్నా స్థానంలో మరో టాలెంటెడ్ నటుడు జైదీప్ అహ్లావత్ (Paatal Lok ఫేమ్)ను ఎంపిక చేశారు. అయితే, జైదీప్ పాత పాత్రనే కాకుండా, సరికొత్త రూపంలో కనిపిస్తారని నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ వెల్లడించారు.

‘దృశ్యం 3’ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అక్టోబర్ 2, 2026న గాంధీ జయంతి (దృశ్యం డే) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇది ఈ ఫ్రాంచైజీలో చివరి భాగం కావడంతో కథలో మరిన్ని ట్విస్టులు ఉండబోతున్నాయని అజయ్ దేవగణ్ ఇప్పటికే ఒక చిన్న టీజర్ ద్వారా హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ సరసన శ్రియా శరన్, టబు, ఇషితా దత్తా తమ పాత పాత్రల్లోనే అలరించనున్నారు.