TELANGANA

జర్నలిస్టుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు: కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు నిప్పులు

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత టి. హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పట్ల పాలకులు విసుగు ప్రదర్శించడం సరికాదని హితవు పలికారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రభుత్వం అటకెక్కించిందని ఆయన ఆరోపించారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ జర్నలిస్టుల నిధి కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలో జర్నలిస్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని హరీశ్ రావు విమర్శించారు. జర్నలిస్టులకు ఉచిత హెల్త్ స్కీమ్ అందించిన చరిత్ర తమదని, ఇప్పుడు ఆ సేవలు కుంటుపడ్డాయని మండిపడ్డారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా, ఒక్క కొత్త అక్రిడిటేషన్ కార్డు కూడా జారీ చేయలేదని ఆయన నిలదీశారు.

అర్హులైన జర్నలిస్టులందరికీ తక్షణమే ఎటువంటి కఠిన నిబంధనలు లేకుండా కార్డులు జారీ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు ఉచిత వైద్య సేవలు అందించాలని, అలాగే గతంలో మాదిరిగానే వారి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. జర్నలిస్టు కుటుంబాల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన హెచ్చరించారు.