దేశంలో మావోయిస్టు ఉద్యమ ప్రభావం తగ్గుముఖం పడుతున్న వేళ, ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి గురించి చర్చ మళ్ళీ మొదలైంది. గణపతి సోదరుడు రామచంద్ర రావు మీడియా ముందుకు వచ్చి, తన అన్నను వెంటనే పోలీసులకు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. చాలా మంది అగ్రనేతలు ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలిసిపోయారని గుర్తు చేస్తూ, తన అన్న కూడా ఇంటికి రావాలని తమ కుటుంబం మొత్తం ఎదురుచూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ ద్వారా మావోయిస్టు రహిత భారత్‌ను లక్ష్యంగా పెట్టుకున్న తరుణంలో ఈ విజ్ఞప్తి ప్రాధాన్యత సంతరించుకుంది.
మంగళవారం రోజున తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు దేవ్‌జీ, సంగ్రామ్, గంగన్న, సాగర్ వంటి కీలక నేతలతో పాటు సుమారు 20 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ, గణపతి కూడా లొంగిపోతే ఆయనపై ఉన్న పాత కేసులను ఎత్తివేయాలని రామచంద్ర రావు ప్రభుత్వాలను కోరారు. దాదాపు 12 రాష్ట్రాల్లో గణపతిపై కేసులు ఉన్నాయని, వయసు పైబడటం మరియు అనారోగ్యం కారణంగా ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు.
గణపతి ఆచూకీపై ప్రస్తుతం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2018లో పార్టీ బాధ్యతలను నంబాల కేశవరావుకు అప్పగించిన తర్వాత ఆయన ఛత్తీస్‌గఢ్ అడవులకే పరిమితమయ్యారు. అయితే, గత ఏడాది ఆగస్టు తర్వాత ఆయన జాడ కనిపించకుండా పోయింది. ఆయన జార్ఖండ్, నేపాల్ మీదుగా ఫిలిప్పీన్స్‌కు పారిపోయి ఉండవచ్చని కొన్ని నిఘా వర్గాలు భావిస్తుండగా, భారత్‌లోనే మారుమూల ప్రాంతాల్లో దాక్కున్నారని మరికొందరు భావిస్తున్నారు. ఈ సందిగ్ధత మధ్య ఆయన సోదరుడు చేసిన విజ్ఞప్తి మావోయిస్ట్ వర్గాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

