ఘట్టమనేని వారసుడు, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ వెండితెర అరంగేట్రం చేస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం నుండి ఒక సంచలన అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘వెంకటప్పయ్య నాయుడు’గా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పవర్, అహంకారంతో నిండిన ఈ పాత్రలో మోహన్ బాబు తనదైన శైలిలో విశ్వరూపం చూపించబోతున్నారని మేకర్స్ పేర్కొన్నారు.
‘RX 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో మోహన్ బాబు హీరోయిన్ తండ్రిగా, నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన పోస్టర్లో కాలికి కడియం, కళ్లలో తీక్షణతతో మోహన్ బాబు కనిపిస్తున్న తీరు చూస్తుంటే, జయకృష్ణకు ఆయన గట్టి పోటీనిచ్చే విలన్‌గా అలరించబోతున్నారని అర్థమవుతోంది.
ప్రస్తుతం మోహన్ బాబు వరుసగా క్రేజీ ప్రాజెక్టులకు సంతకం చేస్తున్నారు. నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ‘ది ప్యారడైజ్’లో శికంజ మాలిక్‌గా నటిస్తూనే, ఇప్పుడు ‘శ్రీనివాస మంగాపురం’లో భాగమయ్యారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ ఎమోషనల్ లవ్ స్టోరీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అశ్వినీ దత్ సమర్పణలో పి. కిరణ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

