తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడిని రాజేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన నోటీసులను అందించేందుకు అధికారులు హైదరాబాద్‌లోని ఆమె ఇంటికి చేరుకున్నారు. గతంలో రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాపై ఉన్న అభియోగాలను కొట్టివేయగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.
సీబీఐ అధికారులు కవిత ఇంటికి వెళ్ళిన సమయంలో ఆమె అందుబాటులో లేకపోవడంతో, అధికారులు ఆ నోటీసులను ఆమె భర్త అనిల్‌కు అందజేశారు. నోటీసుల ప్రకారం, ఈ నెల 16వ తేదీన కవిత కోర్టుకు హాజరు కావాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి మరియు ఆయన కుమారుడికి కూడా అధికారులు నోటీసులు అందజేశారు. ట్రయల్ కోర్టు తమ ఆధారాలను సరిగా పరిగణనలోకి తీసుకోలేదని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది.
మరోవైపు, ఈ పరిణామాలపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు తమకు క్లీన్ చిట్ అని, ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసని కవిత మరియు కేజ్రీవాల్ గతంలోనే స్పష్టం చేశారు. తీర్పు అనంతరం తనపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపితమైందని కేజ్రీవాల్ భావోద్వేగానికి గురవగా, ఇప్పుడు సీబీఐ మళ్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

