కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న డైరెక్ట్ తెలుగు సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో సూర్య ‘సంజయ్ విశ్వనాథ్’ అనే ప్రొఫెషనల్ ఒలింపిక్ షూటర్ పాత్రలో కనిపించనున్నారు. “మనం గొప్ప అనుకున్న ప్రతీసారి మనకన్నా గొప్పోడు ఒకటుంటాడని దేవుడు గుర్తు చేస్తుంటాడు” వంటి పవర్ఫుల్ డైలాగ్స్‌తో టీజర్ ఆకట్టుకుంటోంది. సూర్య స్టైలిష్ వింటేజ్ లుక్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.
ఈ మూవీ ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు ఒక వినూత్నమైన ప్రేమకథ నేపథ్యంలో సాగనుంది. తనకన్నా 20 ఏళ్లు చిన్నదైన అమ్మాయి హీరోను ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలు, అలాగే 40 ఏళ్లు దాటాక ఒక షూటర్ తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ లక్ష్యాన్ని ఎలా సాధించాడనే అంశాలను దర్శకుడు ఆసక్తికరంగా చూపించబోతున్నారని టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. సూర్య కెరీర్లో ఇది 46వ సినిమా కాగా, ఇందులో ఆయన సరసన మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ వంటి సీనియర్ నటీమణులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తెలుగు, తమిళ భాషల్లో ఈ ఏడాది జూలైలో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

