హైదరాబాద్ నగరంలో ఒక హైప్రొఫైల్ సైబర్ నేరం కలకలం సృష్టించింది. ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనవరాలైన దివ్యారెడ్డి దొడ్ల పేరును ఉపయోగించి సైబర్ కేటుగాళ్లు ఏకంగా రూ. 1.2 కోట్లు కాజేశారు. వాట్సాప్‌లో ఆమె ఫోటోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టి, తానే స్వయంగా మాట్లాడుతున్నట్లు నమ్మించి కంపెనీ అకౌంటెంట్‌ను బురిడీ కొట్టించారు. ఈ తరహా మోసాన్ని సైబర్ నిపుణులు ‘సీఈవో ఫ్రాడ్’ (CEO Fraud) లేదా ‘వాట్సాప్ ఇంపర్సనేషన్ స్కామ్’ అని పిలుస్తున్నారు.
దొడ్ల డెయిరీ డైరెక్టర్‌గా ఉన్న దివ్యారెడ్డి ఒక ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నారని, అత్యవసరంగా డబ్బు బదిలీ చేయాలని అకౌంటెంట్‌కు వాట్సాప్ సందేశం రావడంతో ఈ ఘటన మొదలైంది. ఆ సందేశాన్ని నిజమని నమ్మిన అకౌంటెంట్ రఘుబాబు, కంపెనీ ఖాతా నుంచి రూ. 1.2 కోట్లను నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. ఆ తర్వాత రెండోసారి కూడా మరో రూ. 18 లక్షలు అడగడంతో అనుమానం వచ్చిన అకౌంటెంట్, నేరుగా దివ్యారెడ్డిని సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది.
ఈ భారీ మోసంపై దివ్యారెడ్డి జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి ఫిర్యాదు చేయడంతో పాటు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలను, డిజిటల్ ఆధారాలను ట్రేస్ చేస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు, ముఖ్యంగా కంపెనీల ఆర్థిక లావాదేవీలు చూసేవారు అప్రమత్తంగా ఉండాలని, ఎంతటి ఉన్నతాధికారుల నుంచి సందేశాలు వచ్చినా డబ్బు పంపే ముందు ఫోన్ ద్వారా ధృవీకరించుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

