సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తును మార్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో యువతకు ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం అడుగులు వేసింది. మొత్తం రూ. 39,436 కోట్ల విలువైన భారీ పారిశ్రామిక పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వివరాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు.
ఐటీ హబ్‌గా విశాఖ.. అమరావతిలో క్వాంటం వ్యాలీ
విశాఖపట్నం నగరాన్ని గ్లోబల్ డిజిటల్ డెస్టినేషన్‌గా మార్చడమే లక్ష్యంగా అదానీ ఇన్‌ఫ్రా సహా గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ సంయుక్తంగా ఏర్పాటు చేసే ‘ఏఐ డేటా సెంటర్’ ప్రాజెక్టుకు అవసరమైన భూమి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు కేబినెట్ అంగీకరించింది. క్రెడెన్స్ రియాలిటీ నిర్మించనున్న ఐటీ పార్క్ ద్వారా వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఫ్యూజీ సాఫ్ట్‌వేర్ అలాగే సిటెక్ డేటా వంటి అంతర్జాతీయ సంస్థల రాకతో విశాఖ ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కనుంది. మరోవైపు రాజధాని అమరావతిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కేంద్రంగా మారుస్తూ ‘క్వాంటం వ్యాలీ’ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సి-డాక్ (C-DAC) ఆధ్వర్యంలో హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. క్వాంటం ఏఐ గ్లోబల్ వంటి ప్రముఖ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
సెమీకండక్టర్లు.. ఎలక్ట్రానిక్స్ విప్లవం
ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉన్న సెమీకండక్టర్ల తయారీలో ఏపీ కీలక ముందడుగు వేసింది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆర్ఆర్పీ (RRP) ఎలక్ట్రానిక్స్ సంస్థ సుమారు రూ. 10,240 కోట్లతో భారీ సెమీకండక్టర్ యూనిట్‌ను స్థాపించనుంది. కుప్పం నియోజకవర్గంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం లిథియం అయాన్ బ్యాటరీల ముడి పదార్థాల తయారీ ప్లాంట్‌ను ఎన్‌పీఎస్‌పీఎల్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. పీజీ టెక్నో ప్లాస్ట్ విస్తరణ ద్వారా గృహోపకరణాల తయారీ రంగం కూడా మరింత బలోపేతం కానుంది. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా విశాఖలోని ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెల్లూరు జిల్లాలో శామ్ మెటాలిక్స్ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేబినెట్ సమ్మతించింది.
జోనల్ వ్యవస్థలో మార్పులు.. విద్యా సంస్కరణలు
పరిపాలన సౌలభ్యం తో పాటు ఉద్యోగ నియామకాల కోసం పాత జోనల్ వ్యవస్థను సవరిస్తూ ‘ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్-2025’ను ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని ప్రకారం రాష్ట్రాన్ని 4 జోన్ల నుండి 6 జోన్లుగా పునర్వ్యవస్థీకరించారు. ఉన్నత విద్యను సామాన్యులకు సైతం చేరువ చేసేలా ప్రైవేట్ వర్సిటీల స్థాపన నిబంధనలను ప్రభుత్వం సరళతరం చేసింది. భూమి కేటాయింపులు సహా నిధుల నిబంధనలను తగ్గించడం ద్వారా ప్రముఖ విద్యా సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానిస్తోంది. రాష్ట్రంలోని వారసత్వ కట్టడాలను కాపాడేందుకు ‘అడాప్ట్ ఏ మాన్యుమెంట్’ పాలసీని ప్రవేశపెట్టింది. పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ గడువు పొడిగింపుతో పాటు పలు సాగునీటి ప్రాజెక్టుల అంచనాలకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

