వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బాంబ్ పేల్చారు. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన.. మీడియా రంగంలోకి వస్తున్నట్లు ప్రకటన చేశారు. త్వరలోనే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్ ను లాంచ్ చేయనున్నట్లు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ మీడియా.. బ్యాలెన్స్‌డ్, అన్‌బయాస్డ్, ట్రూత్‌కు కట్టుబడి ఉంటుందన్నారు. సాధారణ ప్రజలు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు, పేదల సమస్యలపై పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ డిజిటల్ మీడియా సక్సెస్ అయిన తర్వాత తెలుగులో శాటిలైట్ న్యూస్ ఛానల్ ప్రారంభిస్తానని విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్ పేరు త్వరలో ప్రకటిస్తామని స్టే ట్యూన్డ్ అంటూ పోస్టు పెట్టారు. విజయసాయి రెడ్డి ప్రకటనతో తెలుగు మీడియాలో చర్చ మొదలైంది.
రాజకీయాల నుంచి మీడియా వైపు
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెంబర్ 2గా ఎదిగిన విజయసాయి రెడ్డి అనంతరం.. అనూహ్యంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆయన టీడీపీ, బీజేపీలోకి వెళ్తున్నట్లు ప్రచారం జరిగినా.. రాజకీయాలకు గుడ్ బై రైతుగా మారారు. రాజకీయాలపై స్పందించడం కూడా తగ్గించారు. అయితే ఉన్నట్టుండి శనివారం ఎక్స్ వేదికగా సంచలన పోస్టు పెట్టారు. మీడియా రంగంలోకి వస్తున్నట్లు విజయసాయి రెడ్డి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.
స్వతంత్ర మీడియా
తెలుగు రాష్ట్రాల్లో పలు మీడియా సంస్థలు ఆయా రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తుంటాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి కొమ్ముకాయకుండా స్వతంత్రంగా పేదల పక్షాన పోరాడేందుకు మీడియా రంగంలోకి వస్తున్నట్లు విజయసాయి రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. యువత ఉపాధి అవకాశాలు, రైతు సమస్యలు, మహిళల భద్రత, సామాన్యుల హక్కులపై తమ ప్లాట్ ఫామ్ పోకస్ చేస్తుందని విజయసాయి రెడ్డి తెలిపారు.

