AP

ఏపీ సచివాలయ నేత వెంకట్రామిరెడ్డికి కోలుకోలేని దెబ్బ..

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నిలిపివేసింది ప్ర‌భుత్వం. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (GAD) జీవో ఎంఎస్ నంబర్ 43ను విడుదల చేసింది.

 

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి, వైఎస్‌ఆర్‌సీపీ (YSRCP)కి అనుకూలంగా ప్రచారం చేశారనేది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యం కిందకు వస్తుందని విచారణలో నిర్ధారించారు.

 

వెంకట్రామిరెడ్డి గత కొన్నేళ్లుగా రాజకీయంగా వివాదాస్పద వ్యక్తిగా నిలిచారు. గత ఎన్నికల సమయంలో వెంకట్రామిరెడ్డి తన అధికార పరిధిని దాటి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు అనేకమార్లు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

 

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉంటూ, ప్రభుత్వ నిర్ణయాలకు బాధ్యతాయుతంగా మద్దతు ఇచ్చేవారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఆయన కడప జిల్లాలో వైసీపీ కోసం పనిచేశారని ఈసీకి నివేదికలు అందాయి.

 

ఈ ఆరోపణలపైనే ఏప్రిల్ 2024లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయనను ప్రభుత్వం తొలిసారి సస్పెండ్ చేసింది. అప్పటి నుండి కొనసాగిన విచారణ ఇప్పుడు ఆయన శాశ్వత తొలగింపునకు దారితీసింది.సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇలా రాజకీయ వివాదాల్లో చిక్కుకుని ఉద్యోగం కోల్పోవడం అరుదుగా జరుగుతుంటుంది. దీనివల్ల ఆయన తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కోల్పోవడం పెద్ద దెబ్బే.