ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పుట్టినరోజు సందర్భంగా ఒక కీలకమైన ఫైలుపై సంతకం చేసి, పేదల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.56.39 కోట్లను విడుదల చేస్తూ ఆయన ఆమోదముద్ర వేశారు. ఈ నిర్ణయంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది, ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న 7,074 మందికి లబ్ధి చేకూరనుంది.
ఉగాది, నూతన సంవత్సరం వంటి ప్రత్యేక సందర్భాల్లో పేదలకు మేలు చేసే కార్యక్రమంతోనే తన దినచర్యను ప్రారంభించడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంప్రదాయం. ఈ పుట్టినరోజున కూడా ఆయన అదే పద్ధతిని కొనసాగించారు. ఉదయం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్న అనంతరం, ఆయన నేరుగా అన్నా క్యాంటీన్‌కు వెళ్లి అక్కడ పేదలతో కలిసి అల్పాహారం చేశారు.
అనంతరం, గన్నవరం విమానాశ్రయానికి వెళ్లే మార్గమధ్యంలో చంద్రబాబు ఈ కీలక ఫైలుపై సంతకం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత 22 నెలల కాలంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా 1,43,314 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.1,298.33 కోట్ల ఆర్థిక సాయం అందించడం గమనార్హం. ఆర్థిక ఇబ్బందులు ప్రజల ఆరోగ్యానికి అడ్డంకి కాకూడదనే మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చంద్రబాబు ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

