దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ (Lee Jae-myung) మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్రపతి భవన్ లో ఆయనకు అధికారిక సైనిక వందనం నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఆయన సైనికుల గౌరవాన్ని స్వీకరించారు. అయితే దక్షిణ కొరియా అధ్యక్షుడి పర్యటన వెనుక కీలక అజెండా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీతో భేటి సందర్భంగా ఇరువురి నేతల మధ్య చర్చకు వచ్చే ప్రధాన అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రత్యేక ఒప్పందాలు
ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ మధ్య జరిగే చర్చల్లో ప్రధానంగా కొన్ని అంశాలపై దృష్టి సారించనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సముద్రయాన రంగంలో సహకారం, ఓడల నిర్మాణం, పోర్ట్ క్రేన్ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై ప్రత్యేక ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఏఐ, సెమీకండక్టర్లు, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీలపై కూడా ఇరు దేశాధినేతలు చర్చించే అవకాశముంది.
వాణిజ్యం, పెట్టుబడులు
2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు చేర్చాలని గతంలోనే ఇరుదేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనికోసం కంప్రెహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్ షిప్ అగ్రిమెంట్ (Comprehensive Economic Partnership Agreement – CEPA) సైతం కుదుర్చుకున్నాయి. ఇది మరింత సమర్థవంతంగా వేగంగా అమలయ్యేందుకు అవసరమైన అంశాలపై కూడా ఈ భేటిలో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
రక్షణ, ఇంధన భద్రత
ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో యుద్ధ భయాలు, హర్మూజ్ జలసంధి గుండా చమురు నౌకల ప్రయాణంలో ఆటంకాలు ఇంధన ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన సరఫరా గొలుసును కాపాడుకోవడం, రక్షణ రంగంలో సహకారంపై భారత్ – దక్షిణ కొరియా సంయుక్తంగా దృష్టిసారించే అవకాశాలు ఉన్నాయి.
శాంతి స్థాపనకు కృషి
మరోవైపు ఉగ్రవాదం, మాదద్రవ్యాలు వంటి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారులపై ఈ భేటిలో ఇరువురు నేతలు చర్చించే అవకాశముంది. ముఖ్యంగా కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన, ప్రాంతీయ భద్రతపై కూడా ప్రధాని మోదీ, అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ తమ అభిప్రాయాలును పంచుకోనున్నట్లు సమాచారం. మరోవైపు భేటి అనంతరం ఇరుదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో జరిగే కొరియా-ఇండియా బిజినెస్ ఫోరమ్ లో అద్యక్షుడులీ పాల్గొంటారని తెలుస్తోంది.
‘భారత్తో కలిసి పనిచేస్తాం’
అంతకుముందు దిల్లీలో జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితి నెలకొన్న వేళ.. అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్, దక్షిణ కొరియా కలిసి పనిచేయాల్సిన అవసరముందన్నారు. మరోవైపు హర్మూజ్ జలసంధిలో అన్ని నౌకలు సురక్షితంగా, స్వేచ్ఛగా ప్రయాణించేలా చూసేందుకు కొరియా, భారత్ తో సంప్రదింపులు కొనసాగిస్తుందని అన్నారు.

