AP

అయ్యన్న అరాచకాలపై వైసీపీ సమరభేరి..

విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయ్యన్నపాత్రుడు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అయ్యన్నపాత్రుడు ఒక కొత్త ‘విష సంస్కృతిని’ ప్రవేశపెట్టారని వారు ఆరోపించారు.

 

కేకే రాజు కామెంట్స్..

 

కేకే రాజు మాట్లాడుతూ.. కోర్టు తీర్పులకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్లిన తమపై భౌతిక దాడులకు పాల్పడటం దారుణమన్నారు. రౌడీలు, గుండాలను అడ్డుపెట్టుకుని చంపే ప్రయత్నం చేశారని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉండి ఇలాంటి పనులకు పాల్పడుతున్న అయ్యన్నపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కూటమి నేతలకు బానిసల్లా వ్యవహరించడం మానుకోవాలని, లేనిపక్షంలో న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

 

మాజీ ఎమ్మెల్యే కామెంట్స్..

 

మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ అయ్యన్నపాత్రుడిపై తీవ్రమైన అవినీతి, భూకబ్జా ఆరోపణలు చేశారు. హైకోర్టు ఆదేశాలను దిక్కరించి పనులు చేస్తున్న అయ్యన్న స్పీకర్ పదవికి అనర్హుడని మండిపడ్డారు. ‘నాతవరంలో నల్లకొండమ్మ తల్లి ఆలయ నిర్మాణాన్ని అడ్డుకుని స్టే తెచ్చిన అయ్యన్న అసలు హిందువేనా?’ అని ప్రశ్నించారు. రైతుల కోసం తాను కోర్టుకు వెళ్తే తనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.

 

అయ్యన్న కుటుంబంపై ఆరోపణలు

 

అయ్యన్న కుటుంబంపై మరిన్ని ఆరోపణలు చేస్తూ.. క్వారీల దగ్గర ‘అయ్యన్న ట్యాక్స్’ వసూలు చేస్తున్నారని, తన కొడుకు రాజ్యసభ సీటు కోసం అమరావతి నాయకులకు కోట్లాది రూపాయలు ఆశచూపుతున్నారని విమర్శించారు. జీఎంఆర్ నుంచి నిధులు తీసుకుని, ప్రభుత్వ చెరువులో ‘సృష్టి క్షేత్రం’ పేరుతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, 100 ఎకరాల దేవాలయ భూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాలపై కలెక్టర్, పోలీసుల తీరుపై కోర్టుకు వెళ్తామని చెబుతూ.. ‘మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యన్నకు వడ్డీతో సహా అన్నీ తిరిగి ఇస్తాం’ అంటూ ఘాటుగా హెచ్చరించారు.