కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. ఒకే దేశం-ఒకే పన్ను, ఒకే దేశం-ఒకే ఎన్నిక అంటూ దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాలను కోరుతున్న బీజేపీ.. తమ వారి విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. బుధవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. పోక్సో చట్టం ఒక్కటే అయినప్పటికీ కేంద్రమంత్రుల పిల్లలకు ఒక న్యాయం.. సామాన్యులకు మరో న్యాయం అమలు చేయడంపై మండిపడ్డారు. బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసును నీరుగార్చేందుకు పోలీసులు తొలుత ఇతర సెక్షన్లను పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలపై నేరాల్లో అగ్రస్థానం
తెలంగాణలో ఆడబిడ్డలపై నేరాలు పెరగడంపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం.. మహిళలపై నేరాల్లో దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆరోపించారు. తెలంగాణ మహిళలపై నేరాల రేటులో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచిందని, సైబర్ నేరాలు కూడా భారీగానే పెరిగాయని విమర్శించారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న తెలంగాణ సీఎం అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్ ) ఇచ్చిన నివేదికను ప్రస్తావించారు. సైబర్ నేరాల్లో కూడా టాప్‌లో ఉందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వెల్‌డన్ రాహుల్ గాంధీ.. నిజంగానే తెలంగాణ రైజింగ్ అంటూ కాంగ్రెస్ నాయకత్వాన్ని వ్యంగ్యంగా అభినందించారు.

