National

మీనాక్షి నాటరాజన్‌కు ఎదురుదెబ్బ.. జోక్యానికి నిరాకరించిన సుప్రీంకోర్టు..

కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించారంటూ ఆమె దాఖలు పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టి వేసింది. నామినేషన్ తిరస్కరణలో తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.

 

మీనాక్షి నాటరాజన్‌కు ఎదురుదెబ్బ, పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు

 

రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు ఊరట లభించలేదు. సుప్రీంకోర్టులో కూడా ఆమె రిలీఫ్ దక్కలేదు. ఆమె దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ అతుల్‌ ఎస్‌.చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. ఆమె తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు.

 

రెండేళ్లు జైలు శిక్ష పడే క్రిమినల్‌ కేసులు ఆమెపై లేవని, కేవలం సమన్లు జారీ అయ్యాయని వివరించారు. ప్రైవేటు ఫిర్యాదును కోర్టు ఇంకా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. కేవలం నోటీసు మాత్రమే ఇచ్చారని, క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించలేదనే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. నామినేషన్ తిరస్కరించడం చట్ట విరుద్ధమని, రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా వ్యవహరించారని వివరించారు.

 

పిటిషన్‌ విచారణకు అర్హత లేదన్న న్యాయస్థానం

 

నామినేషన్‌ తిరస్కరణ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది ధర్మాసనం. అలాంటి తీర్పులు ఏమైనా ఉంటే కోర్టుకు వివరించాలన్నారు. రిటర్నింగ్‌ అధికారి అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరిస్తే దానిపై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం సరైన మార్గమని తేల్చిచెప్పింది. ఈ పిటిషన్‌ విచారణకు అర్హత లేదంటూ దాన్ని తిరస్కరించింది.

 

మధ్యప్రదేశ్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్‌ను ప్రతిపాదించింది. రాజ్యసభ సభ్యత్వానికి ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. తెలంగాణలో ఆమెపై ఓ కేసు నమోదు అయ్యిందని, ఆ విషయాన్ని ఆమె తన నామినేషన్‌ పత్రాల్లో దాచిపెట్టారంటూ బీజేపీ అభ్యర్థి మహేశ్‌ కేవత్‌ రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు.

 

ఆమె నామినేషన్‌ను పరిశీలించిన ఆయన, దాన్ని తిరస్కరించారు. ఈ వ్యవహారంపై రెండురోజులుగా రాజకీయ రగడ జరిగింది. తొలుత ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ టీమ్ కలిసింది. అక్కడ రిలీఫ్ లభించలేదు. చివరకు న్యాయస్థానంలో ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది