AP

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..! ఉద్యోగులపై వరాల జల్లు.. భారీ పెట్టుబడులకు ఆమోదం..

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం, రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం, రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడం, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, పర్యాటక రంగం అభివృద్ధి వంటి అంశాలపై క్యాబినెట్ ప్రధానంగా దృష్టి సారించింది. సమావేశానంతరం తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.

 

భారీగా పారిశ్రామిక పెట్టుబడులు

 

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే లక్ష్యంతో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) సిఫారసు చేసిన పలు ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. మొత్తం రూ.39,355 కోట్ల పెట్టుబడులతో, 34,610 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్న కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు:

 

ప్రీమియర్ ఎనర్జీస్ (తిరుపతి): రూ.3,936 కోట్ల పెట్టుబడితో సిలికాన్ వేఫర్, మాడ్యూల్ తయారీ యూనిట్. 540 మందికి ఉపాధి.

కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ (అనకాపల్లి): రూ.2,788 కోట్ల పెట్టుబడితో 1000 మెగావాట్ల డేటా సెంటర్.

ప్రొటేరియల్ ఇండియా (అనకాపల్లి): రూ.2,250 కోట్ల పెట్టుబడితో నియోడిమియం ఐరన్ బోరాన్ మాగ్నెట్ తయారీ పరిశ్రమ. 530 మందికి ఉపాధి.

SFVONE ఇండియా (కాకినాడ): రూ.1,900 కోట్ల పెట్టుబడితో వాడిన వంట నూనెల నుంచి విమాన ఇంధనం తయారు చేసే యూనిట్. 2,500 మందికి ఉపాధి.

ఎన్ఎస్ మాగ్నటెక్ (తిరుపతి): రూ.1,250 కోట్ల పెట్టుబడితో రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ తయారీ. 400 మందికి ఉపాధి.

ఏపీ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (ప్రకాశం): రూ.1,230 కోట్లతో స్టీల్ బెనిఫికేషన్ ప్లాంట్.

 

వీటితో పాటు రేర్ ఎర్త్ మెటల్స్ వెలికితీత, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికంగా ఎండ్-టు-ఎండ్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

 

అమరావతికి జవసత్వాలు

 

ఐదేళ్లుగా నిలిచిపోయిన రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు క్యాబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది.

 

 

ఉద్యోగులకు శుభవార్త

 

ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లపై క్యాబినెట్ సానుకూలంగా స్పందించింది. 2004కు ముందు నోటిఫికేషన్ పొంది, ఆ తర్వాత నియామకం అయిన 2003 డీఎస్సీ టీచర్లు, 10/99 గ్రూప్-1 ఉద్యోగులు సహా మొత్తం 10,715 మంది సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని (OPS) వర్తింపజేయాలని నిర్ణయించింది.

 

షెడ్యూల్ 9, 10 పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 62 ఏళ్లు పూర్తికాని రిటైర్డ్ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరేందుకు అవకాశం కల్పించారు.

 

పోర్టులు, పర్యాటకం, ఇతర నిర్ణయాలు

 

పోర్టుల అభివృద్ధి: కేంద్ర ప్రభుత్వ నూతన చట్టాలకు అనుగుణంగా మచిలీపట్నం పోర్టు పరిధిని 64 కి.మీ. నుంచి 15 కి.మీ.కు, రామయ్యపట్నం పోర్టు పరిధిని 51 కి.మీ. నుంచి 15 కి.మీ.కు కుదిస్తూ నోటిఫికేషన్ల జారీకి ఆమోదం. రామయ్యపట్నం పోర్టును డీబీఎఫ్ఓటీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ఆపరేటర్ నియామకానికి ఆర్ఎఫ్‌పీ జారీకి అనుమతి.

పర్యాటకం: గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ‘హోమ్ స్టే’, ‘బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్’ ఏర్పాటును సులభతరం చేస్తూ పర్యాటక పాలసీకి సవరణలు. తిరుపతి మినహా రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో బార్లు, రిటైల్ మద్యం దుకాణాల ఏర్పాటుకు నూతన విధానానికి ఆమోదం.

రవాణా శాఖ: ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న టూరిస్ట్ బస్సులను రాష్ట్రంలోకి ఆకర్షించేందుకు, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ వాహనాల త్రైమాసిక పన్నును ప్రతి సీటుకు రూ.4,000 నుంచి రూ.2,500కు తగ్గింపు.

ఆరోగ్యశ్రీ: నెట్‌వర్క్ ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నివారించేందుకు “బిల్ డిస్కౌంటింగ్ సిస్టమ్”కు ఆమోదం. దీనివల్ల ఆసుపత్రులు ప్రభుత్వ గ్యారెంటీతో బ్యాంకుల నుంచి తక్షణమే నిధులు పొందవచ్చు.

పరిపాలన: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం సహా 28 జిల్లాల కలెక్టరేట్లలో పాలనను బలోపేతం చేసేందుకు అదనపు పోస్టుల క్రమబద్ధీకరణకు ఆమోదం.

పునరుత్పాదక ఇంధనం: కడప జిల్లాలో 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఏపీఎస్పీసీఎల్‌కు భూమి కేటాయింపు. యాగంటి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 1000 మెగావాట్ల నుంచి 1500 మెగావాట్లకు పెంచేందుకు ఆమోదం.

 

ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న అంశాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.