AP

సాయికృష్ణ అదృశ్యం కేసు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సీఐ నాగరాజు..

విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం కేసులో ఏం జరుగుతోంది? మాజీ సీఐ నాగరాజును దాదాపు 8 గంటల పాటు సిట్ విచారించిందా? విచారణలో నాగరాజు ఎలాంటి విషయాలు బయటపెట్టారు? సిట్ ఐజీ విచారించినా నాగరాజు నోరువిప్పలేదా? నాగరాజు సైలెంట్‌పై ఖాకీ వర్గాల్లో కలకలం రేపుతోంది?

 

సాయికృష్ణ అదృశ్యం కేసు.. ముగిసిన సిట్ విచారణ

 

సాయికృష్ణ అదృశ్యం కేసులో విచారణ ముమ్మరం చేసింది సిట్. మంగళవారం సస్పెండ్ సీఐ నాగరాజుని అరెస్టు చేసిన సిట్ అధికారులు, మధ్యాహ్నం నుంచి పలు దఫాలుగా ఆయన్ని విచారించారు. తొలుత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒకసారి విచారణ చేపట్టారు. మళ్లీ రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు విచారించారు. బుధవారం ఉదయం మరోసారి నాగరాజుని విచారించారు.

 

సిట్ అధికారులు నాగరాజుకు కేవలం 8 ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఐజీ రవిప్రకాష్‌తోపాటు మిగతా ఎస్పీలు అస్మి, అమిత్‌ బర్దర్‌ నేరుగా ప్రశ్నించారు. వ్యక్తిగత, ఇతర విషయాల గురించి చెప్పిన నాగరాజు, సాయికృష్ణ విషయంలో నోరు విప్పలేదని తెలుస్తోంది.

 

షాకింగ్ నిజాలు బయటకు.. న్యాయస్థానం ముందుకు నాగరాజు

 

సాయికృష్ణను మార్కాపురం నుంచి ఎందుకు తీసుకొచ్చారన్న దానిపై పలు విధాలుగా సిట్ అధికారులు ప్రశ్నలు సంధించినా నాగరాజు మాత్రం నోరు విప్పలేదని తెలుస్తోంది. నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ కేసులో సాయికృష్ణను కోర్టులో హాజరుపర్చకుండా ఏం చేశారంటూ ప్రశ్నలు సంధించారు.

 

తనకు తెలీదని తప్పించుకునే ప్రయత్నం చేశారట సీఐ నాగరాజు. స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీ ఏమైంది? డిలీట్‌ చేసిన విషయం మీకు తెలుసా? లాకప్‌లో కొట్టడం వల్ల సాయికృష్ణ చనిపోయాడా? మరణిస్తే ఆయన డెడ్‌బాడీ ఎక్కడంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. పై అడిగిన ప్రశ్నలకు నాగరాజు నోరువిప్పలేదని తెలుస్తోంది.

 

సాయికృష్ణ తల్లి ప్రధాన ఆరోపణ చేశారు. మా కొడుకుని లాకప్‌లో కొట్టడం వల్లే చనిపోయాడని పేర్కొన్నారు. ఆ కోణంలో ప్రశ్నలు సంధించినా నాగరాజు నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదని సమాచారం. నాగరాజు విచారణ పూర్తి కావడంతో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కోర్టులో ఆయన్ని హాజరుపర్చనున్నారు సిట్ అధికారులు.

 

విచారణ సందర్భంగా సిట్ సేకరించిన ఆధారాలు న్యాయస్థానం ముందు ఉంచనుంది. కేసు తీవ్రత, లభించిన ఆధారాల మేరకు న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరోవైపు నాగరాజు అరెస్ట్‌పై విజయవాడలో స్థానికులు ఆందోళనకు దిగారు. విధులు సరిగా నిర్వహించివారిని విచారిస్తే.. న్యాయం ఇంకెవరికి జరుగుతుందంటూ నినాదాలు చేస్తున్నారు. సీఐ నాగరాజు వల్ల గంజాయి వ్యవహారం తగ్గుముఖం పట్టిందని స్థానిక ప్రజలు

చెబుతున్నారు.