ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆ శాఖ అధికారులకు మరో తీపికబురు అందించారు. తాజాగా 42 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు (ఎంపీడీవోలు), డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా (డీడీవోలు) పదోన్నతులు కల్పించే ప్రక్రియకు పచ్చజెండా ఊపారు. ఇందుకు సంబంధించిన సీనియారిటీ జాబితాను డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) ఆమోదించింది. దీంతో త్వరలోనే వీరందరూ ఉన్నత హోదాలో బాధ్యతలు చేపట్టనున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. ఇప్పటికే సుమారు 10 వేల మందికి పైగా సిబ్బందికి ప్రమోషన్లు కల్పించారు. గత పదేళ్లలో ఇంత భారీ సంఖ్యలో ఈ శాఖలో పదోన్నతులు ఇవ్వడం ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు.
వర్షాకాలంపై కీలక సమీక్ష.. పవన్ కీలక ఆదేశాలు
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణ తేజతో మాట్లాడి, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
“వర్షాకాలంలో నిలిచి ఉన్న నీటితో దోమలు పెరిగి, పైపులైన్ల లీకేజీల వల్ల తాగునీరు కలుషితమై ప్రజలు అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది. ప్రతి గ్రామ పంచాయతీ ప్రజారోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలి. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. అన్ని గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలు అందుబాటులో ఉంచి, అవసరమైన చోట తక్షణం వినియోగించాలి” అని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.

