ఈరోజు డైనోసార్ల గురించి ప్రపంచానికి స్పష్టమైన అవగాహన ఉంది. కానీ ఒకప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. భారీ శిలాజాలు దొరికినా అవి ఏ జీవికి చెందినవో శాస్త్రవేత్తలకు తెలియదు. అలాంటి ఆసక్తికర సంఘటనే 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో జరిగింది. తర్వాత అదే శిలాజం చరిత్రలో నమోదైన తొలి డైనోసార్ ఆనవాళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
1676లో ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో సున్నపురాయి గనిలో కార్మికులు భారీ కాలి ఎముకను వెలికితీశారు. ఈ శిలాజాన్ని ప్రకృతి శాస్త్రవేత్త రాబర్ట్ ప్లాట్ పరిశీలించి 1677లో తన పుస్తకంలో వివరించారు. అది చాలా పెద్ద జీవికి చెందినదని ఆయన గుర్తించినా, డైనోసార్ల గురించి అప్పటికి ఎవరికీ తెలియదు.
ఆ కాలంలో, అంతరించిపోయిన జంతువుల భావనే లేదు. దేవుడు సృష్టించిన ప్రతి జీవి ఎక్కడో ఒకచోట ఇప్పటికీ ఉంటుందనే నమ్మకం ఉండేది. అందుకే ఆ ఎముక గుర్రం, ఎద్దు వంటి జంతువులది కాదని ప్లాట్ తేల్చారు. అది బైబిల్‌లో చెప్పిన రాక్షస మనిషిదో లేదా రోమన్ సామ్రాజ్య కాలంలో బ్రిటన్‌కు వచ్చిన భారీ ఏనుగుదో అయి ఉంటుందని భావించారు. అప్పటి జ్ఞానానికి అది సహజమైన అంచనానే.
ఆ అసలు శిలాజం ఇప్పుడు అందుబాటులో లేదు. రాబర్ట్ ప్లాట్ గీసిన బొమ్మలు, రాసిన వివరాలే మిగిలాయి. అయితే చాలా సంవత్సరాల తర్వాత శిలాజాలపై శాస్త్రీయ అవగాహన పెరిగినప్పుడు ఆ చిత్రాలను మళ్లీ పరిశీలించిన నిపుణులు అది ఏనుగు ఎముక కాదని, భారీ మాంసాహార డైనోసార్‌కు చెందినదని గుర్తించారు.
1824లో భూగర్భ శాస్త్రవేత్త విలియమ్ బక్లాండ్ అదే తరహా శిలాజాల ఆధారంగా ఆ జీవికి మెగాలోసారస్ అనే శాస్త్రీయ నామం పెట్టారు. శాస్త్రీయంగా పేరు పొందిన తొలి డైనోసార్‌గా ఇది చరిత్రలో నిలిచింది. ఆ తర్వాత 1842లో మరో శాస్త్రవేత్త రిచర్డ్ ఓవెన్ ఈ తరహా ప్రాచీన సరీసృపాలకు ‘డైనోసోరియా’ అనే పేరు పెట్టడంతో ‘డైనోసార్’ అనే పదం ప్రపంచానికి పరిచయమైంది.
ఒకప్పుడు ఏనుగు ఎముకగా భావించిన శిలాజమే, తర్వాత డైనోసార్ల ఉనికిని నిరూపించే కీలక ఆధారంగా మారింది. శాస్త్ర విజ్ఞానం కాలానుగుణంగా ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పే గొప్ప ఉదాహరణగా ఈ సంఘటన ఇప్పటికీ నిలిచిపోయింది.

