AP

రాయల సీమ స్టీల్ ప్లాంట్ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం..!

రాయల సీమ స్టీల్ ప్లాంట్ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల పల్లెలో రూ.16,350 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న జేఎస్ డబ్ల్యూ రాయలమీస ఉక్కు కర్మాగార పనులను అధికారికంగా చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న స్టీల్ ప్లాంట్ కల.. కూటమి ప్రభుత్వం వచ్చాక నెరవేరబోతోందని చంద్రబాబు అన్నారు. స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభంతో రాయలసీమలో నవశకం మెుదలైందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, అవమానాలు దాటుకుని పనులు ప్రారంభించుకోవడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు.

 

గత పాలకులు మోసపూరితంగా శంకుస్థాపనలు చేసి.. ఇక్కడి ప్రజలను మోసం చేశారని చంద్రబాబు అన్నారు. ఐదేళ్ల కాలంలో శంకుస్థాపనలు తప్ప ఒక్క ఇటుక కూడా పేర్చలేదన్నారు. గడచిన రెండేళ్లలో చాలా అంశాల్ని పరిష్కరించి ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. 1,100 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం పేర్కొన్నారు. మొదటి దశలో రూ.4 వేల కోట్లు, రెండో దశలో రూ.11,850 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ తో పాటు సోలార్ ఎనర్జీ క్యాప్టివ్ ప్లాంట్ ను సైతం జేఎస్ డబ్ల్యూ ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం తెలిపారు.

 

రాయలసీమకు ఎవరివల్ల నష్టం జరిగిందో ఇక్కడి ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు. జేఎస్ డబ్ల్లూ ప్లాంట్ తో ఈ ప్రాంతం.. సామాజికంగా ఆర్ధికంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు గతంలో తన పాలనలో ఏర్పాటైన కియా ప్లాంట్ గురించి చంద్రబాబు ప్రస్తావించారు. కియా కార్ల పరిశ్రమతో అనంతపురం దశాదిశ మారిందన్నారు. కొందరు స్వార్థపరులు గతంలో కేవలం సొంత ప్రయోజనాల కోసమే పనిచేసి అక్రమాలు చేశారని ఈ సందర్భంగా చంద్రబాబు దుయ్యబట్టారు. ఓబులాపురం గనుల పేరు చెప్పి దోపిడీ చేశారన్నారు. స్మగ్లింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేశారని ఆరోపించారు.

 

రాయలసీమకు చెందిన సంపద ఈ ప్రాంతంలోనే ఉపయోగపడాలని చంద్రబాబు అన్నారు. ఇక్కడి ముడి ఇనుముతో ఇక్కడే ఉక్కు తయారు అవ్వాలని పేర్కొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే ప్లాంట్లతో స్థానికంగానే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు చేపడతామన్నారు. వచ్చే రెండేళ్లలోనే ఈ పరిశ్రమలో ఉత్పత్తి కూడా ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. మరోవైపు రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే రాష్ట్రానికి వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. 9 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రానికి చెందిన యువత మరెక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

 

మరోవైపు ప్రతిపక్ష వైసీపీ పై చంద్రబాబు ఈ సందర్భంగా విరుచుకుపడ్డారు. విధ్వంసమే గొడ్డలి పార్టీకి అజెండా అంటూ విమర్శించారు. వారికి విశ్వసనీయతే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిన్న మావిగన్ అన్నారు. నేడు విజయవాడ అంటున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తులు రాజకీయం చేస్తున్నారు. నమ్మకంతో, విశ్వాసంతో పాలన అందిస్తున్నాం కాబట్టే పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానంతో ఆటలు ఆడుకోవద్దని చెబుతున్నా. గత పాలనలో మన రాజధాని ఏమిటో ఎక్కడుందో కూడా చెప్పలేని పరిస్థితి. ప్రజలంతా గర్వపడే విధంగా కాలరెత్తుకుని చెప్పే విధంగా అమరావతిని అభివృద్ధి చేస్తాం’ అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.