శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగర పాలనను ప్రక్షాళన చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 1955నాటి జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి పలకనుంది. ప్రస్తుత మెట్రోపాలిటన్ అవసరాలకు అనుగుణంగా ‘తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ బిల్లు-2026 ముసాయిదాను ఆదివారం విడుదల చేసింది. 1955లో 15 లక్షల జనాభా ఉన్నప్పటి నిబంధనలు నేటి 1.3 కోట్ల జనాభా కలిగిన మెట్రో నగరానికి సరిపోవడంలేదని భావించిన ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఒకే సమీకృత పాలనా వ్యవస్థ కిందకు తీసుకురావాలని ప్రతిపాదించింది.
ఎగ్జిక్యూటివ్ కమిటీ..
ఈ ముసాయిదాపై ప్రజలు, నిపుణులు, అన్ని వర్గాల భాగస్వాములు తమ సూచనలు, అభిప్రాయాలను అందజేయాలని కోరింది. ఏకీకృత పాలన.. వికేంద్రీకరణ నూతన బిల్లు ప్రకారం మెట్రో స్థాయిలో పకడ్బందీ సమన్వయం కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్’ ఏర్పాటు కానుంది. దీనికి అనుబంధంగా ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ పనిచేస్తుంది. మూడు కార్పొరేషన్లను సమన్వయం చేస్తూనే క్షేత్రస్థాయిలో పాలనా వికేంద్రీకరణను కొనసాగిస్తారు. కార్పొరేషన్లు, స్టాండింగ్ కమిటీలు, వార్డ్ కమిటీలు, ఎన్నికల నిర్వహణ వంటి అంశాలు కొనసాగిస్తూ కాలం చెల్లిన ఎన్నికల అనర్హత నిబంధనలను ప్రభుత్వం తొలగించింది. మున్సిపల్ సంస్థల్లో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్లకు ప్రాతినిధ్యం కల్పించాలని బిల్లులో ప్రతిపాదించడం గమనార్హం.
ఆస్తి పన్నులో నవ శకం..
Advertisement
మూలధన విలువ ప్రామాణికం బిల్లులో ఆస్తి పన్ను విధింపు విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న వార్షిక అద్దె విలువ స్థానంలో మూలధన విలువ ఆధారంగా ఇకపై పన్ను లెక్కిస్తారు. అంటే ఆస్తి విలువను బట్టి పన్ను నిర్ణయిస్తారు. ప్రతి ఆస్తికి ఒక సమగ్ర ఆస్తి గుర్తింపు కోడ్ కేటాయిస్తారు. స్వీయ అంచనా విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు, సమయానికి పన్నులు చెల్లించే వారికి రాయితీలు ఇవ్వనున్నారు. దశాబ్దాలుగా ఉన్న ‘కుక్క’ పన్ను, ఆక్ట్రాయ్ వంటి పన్నులను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైడ్రాకు చట్టబద్దత..
భూముల రక్షణకు చట్టబద్ధత చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ బిల్లు ద్వారా చట్టబద్ధత కల్పించనున్నారు. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు హైడ్రాకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. అలాగే విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ కంట్రోల్, వారసత్వ పరిరక్షణ, ఆహార భద్రత కోసం విడివిడిగా ప్రత్యేక సంస్థలు పనిచేస్తాయి. నీటి సరఫరా, మురుగునీటి నియంత్రణ బాధ్యతలను పూర్తిగా జలమండలికే అప్పగించాలని బిల్లులో ప్రతిపాదించారు.
నైట్ ఏకానమీకి..
నగరంలో వ్యాపారాలను ప్రోత్సహించేందుకు నైట్ ఏకానమీకి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దాంతోపాటు సింగిల్ ట్రేడ్ లైసెన్స్ విధానం తీసుకురానున్నారు. భవన నిర్మాణాలకు దరఖాస్తు చేసుకున్న నిర్ణీత సమయంలో అధికారులు స్పందించకుంటే ‘డీమ్డ్ అప్రూవల్’ లభిస్తుంది. జీఐఎస్ ఆధారిత వీధుల అభివృద్ధి ప్రణాళికలు, భూగర్భ యుటిలిటీ వ్యవస్థలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. చిన్నపాటి నిబంధనల ఉల్లంఘనలకు జైలు శిక్షల వంటి క్రిమినల్ చర్యల బదులు, దశలవారీగా సివిల్ జరిమానాలు విధిస్తారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చే క్రమంలో నైట్ ఎకానమీ కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నారు. పౌర సేవలను వేగవంతం చేసేందుకు క్యూర్ స్మార్ట్ గవర్నెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు..
సరికొత్త పాలన..
విద్యుత్, నీరు వంటి అన్ని సేవలకు సంబంధించి ఒకే సమీకృత యుటిలిటీ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా పౌరుల ఇబ్బందులు తొలగించనున్నారు. ప్రజల ఫిర్యాదుల త్వరిత పరిష్కారం కోసం ప్రత్యేకంగా క్యూర్ అప్పీలేట్ అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ముసాయిదా బిల్లులో పేర్కొంది. ఈ నూతన చట్టం అమల్లోకి వస్తే భాగ్యనగర పట్టణ పాలనలో సరికొత్త అధ్యాయం మొదలవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది

