TELANGANA

కేసీఆర్ ఒప్పుకుంటే రేపే అసెంబ్లీ.. దమ్ముంటే డేట్ ఫిక్స్ చేయండి- సీఎం రేవంత్..

తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, నిధుల దుర్వినియోగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టు దెబ్బతినడానికి గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అవినీతి స్వార్థమే కారణమని మండిపడుతూ, దీనిపై అసెంబ్లీలో సమగ్ర చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు.

 

ప్రాణహిత నుంచి కాళేశ్వరం దాకా.. అంచనాల పెంపు

 

వైఎస్సార్ హయాంలో 16.40 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో తక్కువ అంచనా వ్యయంతో (రూ. 39 వేలు) ప్రారంభమైన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా రీడిజైన్ పేరుతో మార్చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. నిపుణుల కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్దని వారించినా, కేసీఆర్ తన సొంత లాభం కోసం ఆ నివేదికను పక్కనబెట్టి ‘వ్యాప్కోస్’ సంస్థతో అనుకూల నివేదిక తెప్పించుకున్నారని ఆరోపించారు. కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టు అంచనాలను రూ. 81 వేల కోట్లకు పెంచారని, కానీ నీళ్లు కానీ, ఆయకట్టు కానీ పెరగలేదని ఎండగట్టారు.

 

పునాది లేని నిర్మాణాలు – కుప్పకూలిన బ్యారేజీలు

 

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో ఎలాంటి భూ పరీక్షలు చేయకుండా, ఇసుక పునాదులపై నిర్మించడం వల్లే ఈరోజు అవి కుప్పకూలే స్థితికి వచ్చాయని సీఎం ధ్వజమెత్తారు. ‘నా మెదడు రంగరించి కట్టాను’ అని చెప్పుకున్న కేసీఆర్ నిర్వాకం వల్లే.. ప్రారంభమైన ఏడాదిలోనే మేడిగడ్డ దెబ్బతిన్నదని, నాణ్యతా లోపాలు, సరైన నిర్వహణ లేకపోవడమే దీనికి కారణమని ఎన్డీఎస్ఏ (NDSA) నివేదిక కూడా స్పష్టం చేసిందని గుర్తుచేశారు. కన్నెపల్లి పంప్‌హౌస్ మునిగిపోవడం వెనుక అధికారుల నిర్లక్ష్యంతో పాటు నాణ్యత లేకపోవడమే ప్రధాన కారణమన్నారు.

 

ఆర్థిక ఉగ్రవాదులు.. అసెంబ్లీ సవాల్

 

తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రానికి రూ. 8.21 లక్షల కోట్ల అప్పులు మిగిల్చి, కాళేశ్వరం పేరుతో రూ. లక్ష కోట్లకు పైగా ప్రజాధనాన్ని బూడిదలో పోసిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను రేవంత్ రెడ్డి ‘ఆర్థిక ఉగ్రవాదులు’గా అభివర్ణించారు. కాళేశ్వరంపై చర్చకు రాకుండా మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లను పంపిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కోరుకుంటే అసెంబ్లీ ప్రత్యేక ఉమ్మడి సమావేశం (జాయింట్ సెషన్) ఏర్పాటు చేయడానికి సిద్ధమని, స్పీకర్‌కు లేఖ రాసి తేదీ ఖరారు చేయాలని సవాల్ విసిరారు. వారు చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని, తప్పులను నిరూపిస్తే మూడేళ్ల పాటు ప్రాజెక్టు రిపేర్ల బాధ్యతను వారికే అప్పగిస్తామని సీఎం స్పష్టం చేశారు.